బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపాను తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి 710 కిలోమీటర్లు, విశాఖకు 460 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 454 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఫోని..క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గడిచిన ఆరు గంటలుగా 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను..ప్రస్తుతం మరింత వేగం పెంచి 10 కి కిలోమీటర్ల వేగం దూసుకొస్తోంది.
తీరానికి చేరువయ్యే కొద్ది తుపాను మరింత బలోపేతమయ్యే సూచనలు కలిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 3న (ఎల్లుండి ) మధ్యాహ్నాం ఒడిశాలోని పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో 205 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఒడిషా, ఉత్తరాంధ్రలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హోచ్చరికలు జారీ చేశారు. తుపాను గమనాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.