న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో 4వ విడత పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 71 లోక్ సభ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 945 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో సోమవారం 4వ విడత పోలింగ్ జరగనుంది. ఇవేకాకుండా జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్ సభకు సైతం రేపు పోలింగ్ జరగనుంది. భద్రతాపరమైన కారణాల రీత్యా అనంతనాగ్ లోక్ సభ స్థానానికి మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న అనంతనాగ్‌లో తొలి విడత పోలింగ్ జరిగింది. మొత్తం 9 రాష్ట్రాలు కలిపి ఓటర్ల కోసం 1 లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. 12 కోట్ల 79 లక్షల మంది ఓటర్లు ఈ పోలింగ్‌లో పాల్గొననున్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపినే అత్యధిక స్థానాలు గెల్చుకుని చరిత్ర సృష్టించింది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అప్పుడు బీజేపినే మెజార్టీని సొంతం చేసుకుని అధికారంలోకొచ్చింది. అయితే, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి అధికారాన్ని కోల్పోగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో 4వ విడత పోలింగ్‌తో మొదలవుతున్న లోక్ సభ ఎన్నికలు ఏ పార్టీకి ఎక్కువ స్థానాలను కట్టబెడతాయోననే ఆసక్తి నెలకొని ఉంది.