రాహుల్ గాంధీకి నాలుగో వరుసలో సీటుపై కాంగ్రెస్ ఫైర్

రాహుల్ గాంధీని కించపర్చేందుకు ఈ కుట్ర అంటున్న కాంగ్రెస్ పార్టీ నేత 

Last Updated : Jan 25, 2018, 10:01 PM IST
రాహుల్ గాంధీకి నాలుగో వరుసలో సీటుపై కాంగ్రెస్ ఫైర్

గణతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్‌కి హాజరయ్యే అతిథులకి కేటాయించే సీట్ల విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిర్వాహకులు నాలుగో వరుసలో సీటుని కేటాయించారని, ప్రభుత్వం చేస్తోన్న చీప్ పాలిటిక్స్‌కి ఇది ఓ నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత సంస్కృతికి ఇది విరుద్ధం అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ నేత ఒకరు మోడీ సర్కారు తీరుపై మండిపడ్డారు. "ఇప్పుడే తమకు అందిన సమాచారం ప్రకారం రిపబ్లిక్ డే పరేడ్ వద్ద రాహుల్ గాంధీకి నాలుగో వరుసలో సీటు కేటాయించారని తెలిసింది. ప్రభుత్వంలోని పెద్దలతోపాటు ఆసియాలోని పది దేశాల అధినేతలు హాజరవుతున్న పబ్లిక్ ఫంక్షన్‌లో రాహుల్ గాంధీని కించపర్చడానికే ప్రభుత్వం ఇలా చేసింది" అని ఆరోపించిన ఆయన.. ఏదేమైనా తమ నాయకుడు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరవుతారని తెలిపారు.

"దేశ ప్రజల ముందు, ఆసియాకు చెందిన పది దేశాల అధినేతల ముందు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడి ఈ వేడుకలతో సంబంధం లేదనే సంకేతాలు వెళ్లేవిధంగా కేంద్రం ఈ చర్యకు పాల్పడుతోంది. బీజేపీ పాలన తీరు ఇంతే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంతా మొదటి వరుసలోనే కూర్చున్నారు. గతేడాది అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా తొలి వరుసలోనే సీటు కేటాయించారు కానీ ఈసారి అందుకు భిన్నంగా నాలుగో వరుసలో సీటు కేటాయించి రాహుల్ గాంధీని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు" అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ సీనియర్ నేత కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.

Trending News