సీబీఐ డైరెక్టర్ హోదాలో ఉన్న అలోక్ వర్మను తప్పిస్తూ తాజాగా ప్రధాని కార్యాలయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు రేపు విచారణను చేపట్టనుంది. గత కొంతకాలంగా అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్తానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో సీబీఐయే స్వయంగా తమ డీఎస్పీ అయిన దేవేంద్రకుమార్ను అరెస్టు చేసింది. ఈ క్రమంలో కేంద్రం ఓ చిత్రమైన నిర్ణయం తీసుకుంది. అలోక్ వర్మతో పాటు రాకేష్ ఆస్తానాలను సెలవు పై పంపించి.. సీబీఐ డైరెక్టర్ పదవిలో మరొకర్ని నియమించింది.
అయితే తనను సీబీఐ డైరెక్టర్ పదవి నుండి తప్పించే క్రమంలో ప్రభుత్వం పలు నియమ నిబంధనలను పరిగణనలోకి తీసుకోలేదని చెబుతూ అలోక్ వర్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇటీవలే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. రఫేల్ విమానాల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆ కేసులో విచారణను అలోక్ వర్మ వేగవంతం చేసే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇదే సమయంలో అలోక్ వర్మను కేంద్రం తప్పించడం అనేక అనుమానాలకు తావిస్తుందని పలువురు అంటున్నారు.
తాజాగా సీబీఐ డైరెక్టర్ని ప్రధాని కార్యాలయం తప్పించడం జరిగాక... బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పీకే మిశ్రా, భాస్కర్ కుల్బే, రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అదియా, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్తానా లాంటి వారు ప్రభుత్వ అధికారులుగా ఉంటూ కూడా తప్పుడు పనులు చేస్తున్నారని తెలిపారు. వీరు కాంగ్రెస్ నేత చిదంబరంను కాపాడడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తున్నారని సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. వీరు నరేంద్ర మోదీ ప్రభుత్వంతో పాటు ప్రజాభీష్టాలకు వ్యతిరేకంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని స్వామి తెలిపారు.
ఇలాంటి అవినీతిపరులైన అధికారులు ప్రభుత్వంలో సేవలు అందిస్తుండడం వల్లే భారతదేశానికి తిరిగి రావాల్సిన నల్లధనం తిరిగి రావడం లేదని.. ఇలాంటి అవినీతిపరులైన అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చి.. రాబోయే ఎన్నికల్లో ఓడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలిపారు. ఇలాంటి అధికారులే ప్రభుత్వానికి సహకరించకుండా నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారు దేశం విడిచివెళ్లిపోవడానికి సహకరిస్తున్నారని తెలిపారు. కానీ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ నిజాయతీపరుడని.. ఆయన విషయంలో మోదీ పునరాలోచించాలని స్వామి తెలిపారు.