Gold prices : ఏడేళ్ల గరిష్టానికి పెరిగిన బంగారం ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధపూరిత వాతావరణం భారత్‌లో బంగారం, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమాన్ మృతికి ప్రతీకారం తీర్చుకుంటూ ఇరాక్‌లోని అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిన రోజే బంగారం ధరలకు మరింత రెక్కలొచ్చాయి.

Last Updated : Jan 8, 2020, 11:38 PM IST
Gold prices : ఏడేళ్ల గరిష్టానికి పెరిగిన బంగారం ధరలు

న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధపూరిత వాతావరణం భారత్‌లో బంగారం, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమాన్ మృతికి ప్రతీకారం తీర్చుకుంటూ ఇరాక్‌లోని అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిన రోజే బంగారం ధరలకు మరింత రెక్కలొచ్చాయి. బుధవారం నాడు బంగారం ధరలు 2 శాతం పెరిగాయి. దాదాపు ఏడు సంవత్సరాలలో మొదటిసారిగా గరిష్టస్థాయిలో 1,600 డాలర్ల మార్కును తాకింది. స్పాట్ గోల్డ్ సైతం ఔన్స్‌కు 0.8% పెరిగి 1,585.80 డాలర్ల మార్కును చేరుకుంది. మార్చి 2013 నుండి ప్రామాణికంగా తీసుకుంటే.. తొలిసారిగా అత్యధికంగా 1,610.90 డాలర్ల మార్కుని తాకడం ద్వారా ఏడేళ్లలోనే అత్యధిక పెరుగుదల రికార్డును నమోదు చేసుకుంది. రాయిటర్స్ నివేదికల ప్రకారం యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1% పెరిగి 1,589.30 డాలర్లకు చేరుకుంది. మొత్తంగా డొమెస్టిక్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.630 వరకు పెరిగి రూ.41290 వరకు పలుకుతోంది. ఇక కిలో వెండి కూడా 1.4శాతం.. అంటే సుమారు రూ700 మేర రూ.48785 వద్ద ట్రేడ్ అవుతోంది. 

బుధవారం తెల్లవారుజామున ఇరాక్‌లోని అమెరికా నేతృత్వంలో సేవలందిస్తోన్న మిలిటరీ బలగాలపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ దాడితో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. సులేమాన్ హత్య నేపథ్యంలో అమెరికాపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే... ఇరాన్ అంతకు రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించినప్పటికీ.. అగ్రరాజ్యం హెచ్చరికలను పెడచెవిన పెడుతూ ఇరాన్ తాను అనుకున్న పని తాను చేసింది. 

గత వారం యుఎస్ డ్రోన్ దాడిలో హత్యకు గురైన ఇరాన్ సైనిక కమాండర్ సులేమాన్ అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి ఇరాన్ ప్రతీకార దాడికి పాల్పడటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ఓ ట్వీట్ చేస్తూ.. ''డ్రోన్ దాడుల్లో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం అంచనా వేసే పనిలో ఉన్నామని.. బుధవారం ఉదయం దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది'' అని పేర్కొన్నారు. బులియన్ మార్కెట్‌కి కీలకంగా భావించే మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే బంగారం ధరలు సైతం అమాంతం పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News