ఢిల్లీ: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుతూ 10 గ్రాముల బంగారం ధర రూ.34,020ల మార్కును తాకింది. అమెరికా సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థ అయిన యూఎస్ ఫెడెరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సంకేతాలు ఇవ్వడంతోపాటు దేశీయంగా గిరాకీ పెరగడమే బంగారం ధరలు అమాంతం పెరగడానికి ఓ కారణమైనట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
గురువారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ. 280 పెరగగా వెండి ధర సైతం నేడు ఏకంగా రూ710 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 39,070కు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరగడమే వెండి ధర పెరగడానికి కారణమైంది.