పుల్వామా దాడి ఘటన మరువక ముందే జమ్మూలో మరో భారీ పేలుడు చోటు చేసుకుంది. జమ్మూ బస్డాండ్ లో శక్తివంతమైన గ్రేనేడ్ పేలుడు సంభవించండంతో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా పేలుడు శబ్దం విని ఉలిక్కిపడిన స్థానికులు..భయంతో పలుగులు తీశారు. కాగా రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మూ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
పేలుడు సమాచారం తెలుసుకుని రంగంలోకి సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. స్థానిక పోలీసుల సాయంతో పేలుడు ఘటనపై విచారిస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. బస్సు కింద గ్రేనేడ్ అమర్చి పేలుడుకు పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. అయితే పేలుడుకు కారకులు ఎవరనే దానిపై విచారణ కొనసాగుతోంది. పేలుడు ఘటనతో జమ్మూ పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జనాల రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు