మోడీపై రాహుల్ ఘాటు విమర్శలు

గుజరాత్ డెవలప్ మెంట్ మోడల్ అని చెప్పి ప్రభుత్వం ఏదైతే ప్రచారం చేస్తుందో ..దానిని మోడీ మార్కెటింగ్ మోడల్ అని పేర్కొనవచ్చని రాహుల్ గాంధీ తెలిపారు

Last Updated : Nov 25, 2017, 10:25 AM IST
మోడీపై రాహుల్ ఘాటు విమర్శలు

గుజరాత్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ డెవలప్ మెంట్ మోడల్ అని చెప్పి ప్రభుత్వం ఏదైతే ప్రచారం చేస్తుందో ..దానిని మోడీ మార్కెటింగ్ మోడల్ అని పేర్కొనవచ్చని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం నిజానికి మహిళా వికాసానికి గానీ, చిన్నతరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వడానికి గానీ ఏ విధంగానూ దోహదపడలేదని.. ఇప్పుడు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా మోడీ పంథానే అనుసరిస్తున్నారని రాహుల్  అభిప్రాయపడ్డారు. "గుజరాత్ కేవలం 5, 10 మంది పారిశ్రామికవేత్తలకు మాత్రమే చెందింది కాదు.  రైతులు, కార్మికులు మరియు స్వయంఉపాధి పొందేవారిది కూడా.." అని రాహుల్ తెలిపారు.  మోడీ గుజరాత్  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా మోటార్స్ వారికి నానో కార్ ప్లాంటు పెట్టడానికి 33000 కోట్లు ఉదారంగా ఎందుకిచ్చారో కూడా చెప్పాలని రాహుల్ విమర్శించారు. 

శుక్రవారం తన పర్యటనలో భాగంగా గుజరాత్ వచ్చిన రాహుల్, హైదరాబాద్ దళిత విద్యార్థి రోహిత్ వేముల మరణంపై కూడా మాట్లాడారు. రోహిత్ విషయంలో జరిగింది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వం చేసిన హత్య అని విమర్శించారు. ఒక మంత్రి ఇచ్చిన ఉత్తరం రోహిత్ ఆశలను అడియాశలు చేసిందని, అది కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యేనని తెలిపారు. గుజరాత్ ఎన్నికలు డిసెంబరు 9 నుండి 14 వరకు  జరుగుతున్న క్రమంలో రాహుల్ ఆ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో విరివిగా సంచరిస్తు్న్నారు. సమయం దొరికినప్పుడల్లా మోడీ సర్కారును దుయ్యబెడుతున్నారు. అయితే ఇదే నెల మోడీ కూడా గుజరాత్‌లోని సౌరాష్ట్రతో పాటు దక్షిణ గుజరాత్‌లో కూడా  పర్యటించాలని యోచించడం గమనార్హం. నవంబరు 27 నుండి 29 తేదీలు ఇప్పటికే మోడీ పర్యటనకు ఖరారయ్యాయి. 

Trending News