Heavy Rains & Floods: దేశంలో గత కొద్దిరోజులుగా వివిధ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు దంచి కొడుతున్నాయి. మొన్న ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వరద దృశ్యాలు మరువకముందే పలు రాష్ట్రాల్లో వరద ముంచెత్తుతోంది. యుమునా నది మరోసారి ప్రమాదకర స్థాయి దిశగా ప్రవహిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ వర్షాల నేపధ్యంలో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలో ఏకకాలంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, జమ్ము కశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు గత కొద్దిరోజులుగా పడుుతన్నాయి. కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో సైతం ఏకధాటిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో చోటుచేసుకున్న మార్పులతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు తప్పవని ఐఎండీ సూచించింది. ఎడ తెరిపి లేని వర్షాల కారణంగా గుజరాత్ , యూపీలో వరదలు సంభవించాయి. అటు యమునా నది మరోసారి ప్రమాద స్థాయి దాటడంటో ఢిల్లీలో ఆందోళన నెలకొంది.
గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా వరద నీరు ముంచెత్తుతోంది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జునాగఢ్ పట్టణం దాదాపుగా నీట మునిగింది. హిండెన్ నది నీటిమట్టం పెరుగుతుండటంతో నోయిడా, ఘజియాబాద్‌లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముందు జాగ్రత్త చర్యగా ముంపు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్తేరా, అటోన్ నాగ్లా, ఫిరోజ్ పూర్ గ్రామాల్ని వరద నీరు ముంచెత్తింది.
మరోవైపు భారీ వర్షాల కారణంగా జమ్ము కశ్మీర్, లడఖ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు తలెత్తాయి. కధువా నది వరద ఉధృతి పెరిగింది. జమ్ము శ్రీనగర్ హైవేపై కొండ చరియలు విరిగిపడ్డాయి. అమర్‌నాథ్ యాత్రికులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అటు చీనాబ్ నదిలో కూడా వరద పెరుగుతోంది. లేహ్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇక ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఈసారి కూడా వరదలు చుట్టుముట్టాయి. రుద్రప్రయాగ్‌లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలతో కొండ ప్రాంతాల్లోని ఇళ్లు చాలావరకూ దెబ్బతిన్నాయి. ఉత్తర కాశి జిల్లాలో 50 రోడ్లను మూసివేశారు. 40 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జూలై 25 వరకూ ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇక ఢిల్లీలో మరోసారి ఆందోళన నెలకొంటోంది. యమునా నది మళ్లీ ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడమే ఇందుకు కారణం. ఇవాళ ఉదయం యమునా నది నీటిమట్టం 205.81 మీటర్లకు చేరుకుంది. మొన్నటి వరకూ భారీ వరదలతో అల్లకల్లోలమైన హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి వరద బీభత్సం సృష్టిస్తోంది. సిమ్లాలో ఓ దాబా వరదలో కొట్టుకుపోవడంతో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
ఇక మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు దంచెత్తుతున్నాయి. తూర్పు మహారాష్ట్రలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
Also read: Telangana Rains: రానున్న 4 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు, ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook