పేదలకు, సాధారణ ప్రయాణీకులకి తక్కువ ధరలో ఏసీ ప్రయాణాన్ని అందించే ట్రైన్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. త్వరలో 'గరీబ్ రథ్' రైళ్ల టికెట్ ధరలు పెరగనున్నాయి. గరీబ్ రథ్ రైళ్లలో బెడ్రోల్ కావాలనుకుంటే ప్రస్తుతం రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. పదేళ్ల కిందట నిర్ణయించిన ఈ బెడ్రోల్ ధరను సవరించాలని రైల్వే శాఖ భావిస్తోంది. టికెట్ చార్జీలతో పాటు బెడ్రోల్ చార్జీలనూ వసూలు చేయాలని యోచిస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా లినెన్ ధర పెరిగినా గరీబ్ రథ్ రైళ్లలో ప్రయాణీకులకు అందించే దుప్పట్ల ధరను టికెట్ రేటులో కలపలేదు. అయితే తాజాగా ఈ ధరల భారాన్ని గరీబ్ రథ్ చార్జీలను పెంచడం ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. టికెట్ ధరలోనే బెడ్రోల్ చార్జీలను కలపాలని కాగ్ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు. రానున్న కొద్ది నెలల్లో బెడ్రోల్ ధరలు టికెట్ ధరలో కలపడంతో చార్జీలు పెరుగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.