ఆధార్ లింక్ పేరుతో అకౌంట్‌లో డబ్బులు స్వాహా

అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అంటున్న కేంద్ర ప్రకటనలు కొందరు కేటుగాళ్ళకు కాసులు కురుపిస్తున్నాయి.

Last Updated : Apr 7, 2018, 04:29 PM IST
ఆధార్ లింక్ పేరుతో అకౌంట్‌లో డబ్బులు స్వాహా

అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అంటున్న కేంద్ర ప్రకటనలు కొందరు కేటుగాళ్ళకు కాసులు కురిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ గురించి సమాచారమే తప్ప స్పష్టత లేని అమాయకులను లక్ష్యంగా చేసుకొని.. వారికి కాల్ చేసి ఆధార్, బ్యాంకు వివరాలు పొంది డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆధార్‌ లింక్‌ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఓ సీనియర్‌ సిటిజన్‌ అకౌంట్‌ నుంచి వేల రూపాయలు స్వాహా చేశారు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానేకు చెందిన బాపూరావు షింగోట్‌ అనే వ్యక్తికి ఏప్రిల్ 2న ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము బ్యాంకు సిబ్బంది అని మీ బ్యాంకు అకౌంట్‌ను, ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మీ మొబైల్‌ నెంబర్‌కు పంపిన ‘వెరిఫికేషన్‌ కోడ్‌’ను చెప్పమని వారు అడగ్గా.. నిజమేననుకొని షింగోట్‌ తనకు వచ్చిన ఓటీపీ మెసేజ్ చెప్పేశాడు. ఇంకేం దర్జాగా రూ. 75 వేలు డ్రా చేశారు ఆ వ్యక్తులు.   

గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాంకు అకౌంట్‌ నుంచి నగదు విత్‌డ్రా చేశారని తెలుసుకున్న షింగోట్‌ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. బ్యాంకులు నగదును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌లు తప్పనిసరి. ఓటీపీ టైప్‌ చేస్తే, లావాదేవీ పూర్తవుతుంది. ఈ విషయంపై స్పష్టత లేని అమాయకులను లక్ష్యంగా చేసుకొని.. బ్యాంకు ఉద్యోగులని చెప్పుకుంటూ.. ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి తెలుసుకొని డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. నిజంగానే బ్యాంకు అధికారులు ఆధార్‌ లింక్‌ చేపడుతున్నారని భావిస్తున్న కస్టమర్లు ఈ పాస్‌వర్డ్‌ చెప్పి వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Trending News