న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్ సిబ్బంది భర్తీ కోసం ఐబిపిఎస్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12,075 మంది క్లరికల్ కేడర్ సిబ్బందిని ఐబిపిఎస్ భర్తీ చేయనుంది. ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2019కి సంస్థ అధికారిక వెబ్‌సైట్ ibps.inపై సెప్టెంబర్ 17 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పూర్తి చేసిన వాళ్లందరూ ఈ రాతపరీక్షకు అర్హులేనని ఐబిపిఎస్ స్పష్టంచేసింది. అలహాబాద్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకుల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా ఐబిపిఎస్ భర్తీ చేయనుంది.
నోటిఫికేషన్ షెడ్యూల్‌కి సంబంధించి ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 17 సెప్టెంబర్, 2019
ఆన్‌లైన్ అప్లికేషన్ గడువు చివరి తేదీ: 19 అక్టోబర్, 2019
ఐబిపిఎస్ ప్రిలిమినరి ఎగ్జామ్స్ తేదీలు: డిసెంబర్‌లో 07, 08, 14, 15 తేదీలు
ఐబిపిఎస్ మెయిన్స్ ఎగ్జామ్ తేదీ: 19 జనవరి, 2020
ప్రిలిమినరి పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులనే వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే మెయిన్స్ పరీక్షకు పిలవనున్నట్టు ఐబిపిఎస్ స్పష్టంచేసింది.