భారతదేశంలో మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన డీమానిటైజేషన్ మరియు జీఎస్టీ విధానాల వల్ల దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని.. ప్రభుత్వం ఈ విధానాలు ప్రవేశపెట్టడం మంచిదైందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించింది. ప్రస్తుతం ఈ విధానాల వల్ల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఈ పద్ధతుల వల్ల రానున్న కాలంలో ఆర్థికపరంగా ఎన్నో మార్పులు జరిగే అవకాశం ఉందని ఈ అంతర్జాతీయ సంస్థ తెలిపింది. పాత నోట్లను రద్దు చేయడం, వస్తుసేవలపై పన్ను వేయడం అనేవి ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మకమైన, విప్లవాత్మకమైన నిర్ణయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలిపింది. భవిష్యత్తులో దేశ వృద్ది రేటు పెరగడానికి ఇలాంటి నిర్ణయాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొంది.
అయినప్పటికీ ఇదే సంస్థకు చెందిన ఓ రిపోర్టు భారత దేశ ఆర్థిక విధానాలపై విశ్లేషిస్తూ.. భారత్ ఆర్థిక రంగంలో పలు సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపడం గమనార్హం. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) అనేది 188 దేశాలు కలసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ద్రవ్య సహకారం ఏర్పరిచేందుకు, ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం సులభతరం చేసేందుకు, అధిక ఉపాధిని ప్రోత్సహించి, పేదరికాన్ని తగ్గించేందుకు ఉద్దేశించి కలసిపనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. వాషింగ్టన్, డి.సిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం ఉంది.