ఇండోర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా విధులు నిర్వహిస్తోన్న ప్రవీణ్ కక్కడ్ నివాసంలో ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇండోర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ సోదాలు జరుగుతున్నాయి. విజయ్‌నగర్‌లోని ప్రవీణ్ కక్కడ్ నివాసంలో సుమారు 15 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. ప్రవీణ్ కక్కడ్ నివాసంతోపాటు దాదాపు మరో 50 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో ఐటి దాడులు జరుగుతున్నాయి. ఇండోర్, గోవా, ఢిల్లీ వంటి అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం 300 మందికిపైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు ఏఎన్ఐ వెల్లడించింది.
ఇదిలావుంటే, కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఐటి దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం ఇదే రకమైన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో ఇప్పటివరకు కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతల ఇళ్లపై మాత్రమే దాడులు జరిగాయి కాని ఒక్క బీజేపి నేత ఇంటిపైనైనా ఐటి, ఈడి దాడులు జరిగాయా అని కుమారస్వామి కేంద్రాన్ని నిలదీశారు.