Independence Day 2023: జాతీయ జెండా తొలిసారిగా ఎగిరింది ఎప్పుడు, జెండాలో ఎన్నిసార్లు మార్పులు జరిగాయి

Independence Day 2023: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయింది. 77వ స్వాతంత్య్ర వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకోనుంది. పంద్రాగస్టు వేడుకలకు దేశం యావత్తూ సిద్ధమౌతోంది. ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. ఈ క్రమంలో ఆ మువ్వన్నెల జెండా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 14, 2023, 10:41 AM IST
Independence Day 2023: జాతీయ జెండా తొలిసారిగా ఎగిరింది ఎప్పుడు, జెండాలో ఎన్నిసార్లు మార్పులు జరిగాయి

Independence Day 2023: రేపు అంటే ఆగస్టు 15న దేశ రాజధానిలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఠీవిగా ఎగురనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా కార్యక్రమం జరగనుంది. దేశంలోని ప్రతి ఇంటిపై మూడ్రోజుల పాటు జాతీయ జెండా ఎగరాలని ప్రభుత్వం సూచించింది. అసలీ జాతీయ జెండా ప్రత్యేకత ఏంటి, విశేషాలేంటి, తొలిసారి ఎప్పుడు ఎగుర వేశారు వంటి వివరాలు ఇప్పుడు మీ కోసం..

బ్రిటీషు తెల్లదొరల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశంలో సాగిన స్వాతంత్య్రోద్యమంలో మూడు రంగుల జెండాకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రాణాలు లెక్కచేయకుండా, సత్యను, అహింసను ఆయుధంగా ధరించి..మహాత్ముని నేతృత్వంలో స్వాతంత్య్రం జన్మహక్కని నినదించిన ప్రతి ఒక్కరి చేతిలో నాడున్నది ఈ మూడు రంగుల జెండానే. బ్రిటీషుకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో కొండంత ధైర్యాన్నిచ్చింది ఈ జెండానే.  200 ఏళ్ల వలస పాలనకు చరమగీతం పాడి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సాధించుకున్నప్పుడు దేశం మొత్తం మువ్వన్నెల జెండా చేతపట్టి ఆనందోత్సవాల్లో మునిగింది.

మువ్వన్నెల జాతీయ జెండా విశేషాలు ఇవే

జాతీయ జెండాను తొలిసారిగా 1906 ఆగస్టు 7వ తేదీన కోల్ కతాలోని పార్శీ బేగన్ స్క్వేర్‌లో ఎగురవేశారు. నాడు జాతీయ జెండాలో ఉన్న రంగులు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. 1931 కాంగ్రెస్ మహాసభ మూడు రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించినప్పుడు ఎరుపు స్థానంలో కాషాయం, పసుపు స్థానంలో తెలుపు వచ్చి చేరాయి. మధ్యలో చరఖా చోటుచేసుకుంది. 

ఆ తరువాత జాతీయ జెండాకు కాలక్రమంలో మరిన్ని మార్పులు చేశారు. మూడు రంగుల జెండా మధ్యలో ఉన్న చరఖా స్థానంలో అశోక చక్రాన్ని పొందుపర్చారు. 1947 జూలై 22న అధికారికంగా జాతీయ జెండాగా ప్రకటించారు. ఈ జెండానే 1947 ఆగస్టు 15 నుంచి ప్రతి యేటా రెపరెపలాడుతోంది. తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన జెండా ఇది. 

జాతీయ జెండా ఎగురవేతలో ఆంక్షలు

గతంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు కొన్ని ఆంక్షలు ఉండేవి. ఎంపిక చేసిన రోజుల్లోనే జెండా ఎగురవేయాలనేది ప్రధానమైన నిబంధన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో ఉండేది. అయితే పారిశ్రామిక వేత్త నవీన్ జిందాన్ పదేళ్ల న్యాయపోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు 2004 జనవరి 23న ఆంక్షల్ని తొలగించింది. జాతీయ జెండాకు సముచిత గౌరవం ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం జెండా ఎగురవేయడం ప్రతి భారతీయుడి హక్కుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జెండాలో ఉన్న మూడు రంగుల్లో కాషాయం శక్తికి, ధైర్యానికి ప్రతీక అయితే తెలుపు శాంతికి సత్యానికి గుర్తు. ఇక ఆకుపచ్చ రంగు ప్రగతి, పవిత్రతకు చిహ్నం. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి నిదర్శనం.

Also read: Independence Day 2023: జాతీయ జెండా పరిమాణం ఎంత ఉండాలి, జెండా వందనంలో ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News