చైనా సరిహద్దు వెంబడి భారత్ బలగాల మోహరింపు

చైనా సరిహద్దుల వెంబడి భారత్‌ భారీగా బలగాలను మోహరించింది.

Last Updated : Apr 1, 2018, 04:47 PM IST
చైనా సరిహద్దు వెంబడి భారత్ బలగాల మోహరింపు

చైనా సరిహద్దుల వెంబడి భారత్‌ భారీగా బలగాలను మోహరించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు, చైనా, టిబెట్‌ సరిహద్దుల్లోని డిబాంగ్, డ్యూ- డెలాయ్‌, లోహిత్‌ లోయల్లో ఆర్మీ దళాలను గణనీయంగా పెంచింది. భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా ఆర్మీ బలగాల సంఖ్యను పెంచినట్లు అధికారులు తెలిపారు.

చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రత్యేక నిఘా యంత్రాంగాన్ని కూడా బలోపేతం చేసుకుంటున్నట్లు భారత సైనికాధికారులు తెలిపారు. హెలికాప్టర్లనూ మోహరించినట్లు వివరించారు. భారత్‌- చైనా సరిహద్దుల్లోని 17వేల ఫీట్ల ఎత్తులోని కొండ ప్రాంతాల గుండా చొరబాట్లు జరగవచ్చన్న సమాచారంతో ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాల సంఖ్యను పెంచుతున్నామని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద భద్రత కోసం చిన్నచిన్న సైనిక బృందాలు 15-30 రోజుల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మూడు దేశాల కూడలి సహా వ్యూహాత్మక ప్రాంతాలన్నింటి వద్ద మోహరింపులను పెంచినట్లు.. మౌలిక వసతులనూ పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కీలకమైన కిబితు శిబిరం వద్దకు సైనిక సరఫరాలను చేరవేయడానికి వేలాడే వంతెనలను సైన్యం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

వివాదాస్పద డోక్లామ్‌ సరిహద్దు వెంట ఇప్పటికే చైనా హెలిప్యాడ్స్‌, సెంట్రీ పోస్టులు, కందకాలను నిర్మిస్తున్న విషయాన్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ధ్రువీకరించారు. దీంతో పాటు సరిహద్దు వెంట పలు నిర్మాణాలను కూడా చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది జులైలో డోక్లామ్‌ వద్ద చైనా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడాన్ని భారత్‌ వ్యతిరేకించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Trending News