ఎయిర్‌పోర్టు అంటేనే భద్రతకు, సరైన తనిఖీకి పెట్టింది పేరు. అలాంటి ఎయిర్ పోర్టులో అప్పుడప్పుడు చెకింగ్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ మహిళ పొరపాటున గమనించకుండా తన పాస్ పోర్టు బదులు భర్త పాస్ పోర్టు తీసుకొని ఎయిర్ పోర్టుకి వచ్చేసింది. చెకిన్ దగ్గర, విమానం ఎక్కే దగ్గర కూడా స్టాఫ్ ఎవరూ ఈ పొరపాటు గుర్తించలేదు.
దాంతో ఆమె ఇంగ్లాండ్‌లో విమానం ఎక్కి దుబాయ్ మీదుగా ఢిల్లీ వచ్చేసింది. అయితే ఢిల్లీలో మరల చెకింగ్ జరుగుతున్న సమయంలో ఆమె పాస్ పోర్టు మారిపోయినట్లు గుర్తించింది. అయితే ఆ ఘటన పట్ల ఆమెతో పాటు ఎయిర్ పోర్టు అధికారులు కూడా షాక్ తిన్నారు. ఎమిరేట్స్ విమాన అధికారులను విమర్శలతో ముంచెత్తారు. ఎందుకు అంత బాధ్యతారహితంగా వ్యవహరించారో వివరణ ఇవ్వాలని కోరుతూ.. ప్రయాణికురాలిని ఢిల్లీలోకి అనుమతించకుండా మళ్లీ తిరుగు విమానంలో దుబాయికి పంపించేశారు.
ఆమె ఇంటికి ఫోన్ చేసి ఎలాగైనా పాస్ పోర్టుని దుబాయ్ ఎయిర్ పోర్టుకి చేర్చాలని కోరింది. ఆ తర్వాత ఆమె దుబాయ్ వెళ్లి అక్కడ తన పాస్ పోర్టు తీసుకొని...మళ్లీ ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి బాధ్యతను తీసుకుంటూ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ క్షమాపణ కోరింది. అయితే ప్రయాణికురాలు ఇంగ్లాండ్‌లోనే చెకింగ్ స్టాఫ్ తప్పును గుర్తించి ఉంటే.. తనకు వెంటనే పాస్ పోర్టు తీసుకువచ్చే సమయం ఉండేదని తెలిపారు.