ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసు: రబ్రీదేవి, తేజస్వి యాదవ్‌‌లకు ఊరట

ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసు: రబ్రీదేవి, తేజస్వి యాదవ్‌‌లకు ఊరట

Last Updated : Oct 6, 2018, 11:56 AM IST
ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసు: రబ్రీదేవి, తేజస్వి యాదవ్‌‌లకు ఊరట

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమారుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌‌లకు ఊరట లభించింది. శనివారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు రబ్రీదేవి, తేజస్వి యాదవ్‌‌లు హాజరుకాగా.. కోర్టు వారికి బెయిలు మంజూరు చేసింది. వీరితో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరైన నిందితులందరికీ పాటియాలా కోర్టు మధ్యంతర బెయిలిచ్చింది. నిందితులందరికీ రూ.లక్ష బాండ్, ష్యూరిటీ కింద కోర్టు బెయిలిచ్చింది.

ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కేసు తదుపరి విచారణను నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున ఇవాళ కోర్టు విచారణకు హాజరుకాలేదు. లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ప్రయాణాలు చేయడానికి వీల్లేదని వైద్యులు స్పష్టం చేశారు. దీనితో లాలూను కోర్టులో హాజరుపరచలేమని జైలు అధికారులు కోర్టుకు విన్నవించారు. కానీ నవంబర్ 19న లాలూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఐఆర్‌సీటీసీ కుంభకోణంపై గతేడాది జూలై 5న సీబీఐ కేసు నమోదు చేసింది. రాంచి, పూరీలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఐఆర్‌సీటీసీ నిర్వహించే రెండు హోటళ్లను సుజాతా హోటల్స్ అనే ప్రవేట్ సంస్థకు కట్టబెడుతూ ప్రతిఫలంగా పాట్నాలో బినామీ కంపెనీ పేరుతో మూడు ఎకరాల అత్యంత విలువైన స్థలాన్ని (సుమారు రూ.45 కోట్లు) పొందారని లాలూ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. ఆ రెండు హోటళ్లను క్విడ్ ప్రోకో కింద ఆ సంస్థకు అప్పగించినట్లు.. టెండర్ దక్కగానే ఆ స్థలం లాలూ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లినట్లు సీబీఐ అభియోగాలు మోపింది.

Trending News