ఢిల్లీలోని జామియా నగర్లో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆదివారం మధ్యాహ్నం ఆందోళనకారులు చేపట్టిన నిరసనలో తీవ్రమైన విధ్వంసం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులు మూడు బస్సులను తగలబెట్టి తమ నిరసన వ్యక్తంచేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా ఆందోళనలను అదుపు చేసేందుకు యత్నించిన పోలీసుల(Delhi police)పైనా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో ఆరుగురు పోలీసులకు గాయాలవగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులపైన రాళ్లు రువ్విన నిరసనకారులు జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ(Jamia Millia Islamia university)లోకి పరుగులు పెట్టడంతో వారిని వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు.. అక్కడ చేతికి చిక్కిన వారిపై లాఠీ ఛార్జ్ చేసి ఆందోళనకారులను తరిమికొట్టారు.
Read also : CAB protest in Delhi | పౌరసత్వ సవరణ బిల్లుపై భగ్గుమన్న నిరసనలు.. మూడు బస్సులకి నిప్పు.. స్పందించిన సీఎం
సరిగ్గా ఇదే ఘటనపై జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ విద్యార్థి సంఘాలు, పలువురు సిబ్బంది ఆదివారం రాత్రి పొద్దుపోయాకా ఓల్డ్ ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా.. ఆందోళనతో సంబంధం లేని విద్యార్థులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న విద్యార్థులు.. పోలీసులకు వ్యతిరేక నినాదాలు చేస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యూనివర్శిటీ లైబ్రరీలో ఉన్న విద్యార్థులు, సిబ్బందిపై సైతం పోలీసులు లాఠీ చార్జ్ చేశారని విద్యార్థి సంఘాల నేతలు, సిబ్బంది ఆరోపించారు. విద్యార్థులు, సిబ్బంది ఆందోళనతో అర్థరాత్రి వేళ ఓల్డ్ ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read also : రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
అయితే, ఈ ఘటనపై స్పందించిన సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ చిన్మయ్ బిశ్వాల్.. ఆందోళనకారులు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి పరిగెత్తినందునే అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని.. ఆందోళనకారులను అదుపుచేసేందుకే తాము అక్కడికి వెళ్లామే తప్పితే తమకు మరో ఉద్దేశం లేదని అన్నారు.