ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ వామపక్ష విద్యార్థి నేత కన్నయ్య కుమార్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. బీహార్‌లోని బెగూసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీకి నిలబడనున్నారని వార్తలు వస్తున్నాయి. సీపీఐ బిహార్ కార్యదర్శి సత్యనారాయణ్ సింగ్ మాట్లాడుతూ కన్నయ్యను బెగూసరాయ్ నుంచి ఎన్నికల బరిలోకి దింపేందుకు పార్టీ అంగీకరించిందని తెలిపారు.
అయితే కన్నయ్య రాజకీయ ప్రవేశం గురించి తమ పార్టీ కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలతో కూడా మాట్లాడిందని సింగ్ తెలిపారు. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కన్నయ్య బరిలోకి దిగనున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఓ సమావేశంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్నయ్యను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జైల్లో కొద్ది రోజులు గడిపిన కన్నయ్య.. ఆ తర్వాత మళ్లీ బయటకు వచ్చారు. ప్రస్తుతం బెగూసరాయ్ ప్రాంతంలో లోక్ సభ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఉన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి చెందిన భోళా సింగ్.. ఆర్జేడీకి చెందిన తన్వీర్ హసన్‌ను ఇదే ప్రాంతంలో 58,000 ఓట్లతో ఓడించారు.
బీహార్ బెగూసరాయ్ ప్రాంతంలో జన్మించిన కన్నయ్య కుమార్ కుటుంబం స్వతహాగా సీపీఐ పార్టీకి మద్దతిచ్చేవారు కావడం గమనార్హం. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే కన్నయ్య కుమార్ ఏఐఎస్ఎఫ్‌లో జాయిన్ అయ్యారు. తర్వాత నలంద ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సోషియాలజీలో ఎంఏ చేసిన కన్నయ్య ఆ తర్వాత... జేఎన్‌యూ ఎంట్రన్స్ పరీక్షలో ఫస్ట్ ర్యాంకు సాధించి ఆఫ్రికన్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేయడానికి స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో చేరారు. 2016లో యూనివర్సిటీ క్యాంపస్‌లో దేశానికి వ్యతిరేకంగా పలు స్లోగన్స్ చేశారన్న కారణం చేత కన్నయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.