Professor kills his family over omicron fears: దేశంలో ఒమిక్రాన్ (Omicron) ప్రకంపనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిజానికి దీని తీవ్రతపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేనప్పటికీ అనవసర అపోహలతో కొంతమంది భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నత విద్యావంతులు సైతం ఇలాంటి అపోహలకు గురై విపరీత చర్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో (Kanpur) ఓ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ ఒమిక్రాన్ భయంతో ఏకంగా తన కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టాడు.
కాన్పూర్‌లోని కల్యాణ్‌పూర్‌కి చెందిన ఫోరెన్సిక్ ప్రొఫెసర్ (Forensic professor) సుశీల్ సింగ్ (55) శుక్రవారం (నవంబర్ 3) తన భార్యను గొంతు నులిమి చంపాడు. ఆపై తన కొడుకు, కుమార్తెను కూడా హత్య చేశాడు. సుత్తితో వారి తలలు పగలగొట్టి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం హత్యలపై తన సోదరుడికి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. 'సునీల్.. డిప్రెషన్‌లో చంద్రప్రభ (50) , శిఖర్ సింగ్ (21), ఖుషీ సింగ్ (16) లను చంపేశాను. దీనిపై పోలీసులకు సమాచారమివ్వు..' అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. దీనికి ఎవరూ బాధ్యులు కారని... తన కుటుంబాన్ని చంపుకోవడం ద్వారా తనను తాను ధ్వంసం చేసుకుంటున్నానని అన్నాడు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల నుంచి వారిని విముక్తి చేశానని చెప్పుకొచ్చాడు.
వృత్తి రీత్యా ఫోరెన్సిక్ ప్రొఫెసర్ అయిన తాను... మెడికల్ కాలేజీలో కరోనాతో (Covid 19) చనిపోయినవాళ్ల మృతదేహాలను చూసి విసుగు చెందానని ఆ మెసేజ్‌లో తెలిపాడు. ఇక మృతదేహాలను లెక్కించే పని లేదని పేర్కొన్నాడు. అంతేకాదు, ఒమిక్రాన్ ఎవరినీ వదిలిపెట్టదని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని... ఒమిక్రాన్ (Omicron) కారణంగా ఇక తన జీవితం ముగింపుకు చేరిందనే భయం మరింత పెరిగిందని అందులో పేర్కొన్నాడు.
Also Read: Hyderabad: విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్ పాజిటివ్
అదే మెసేజ్‌లో తానూ ఆత్మహత్య (Suicide) చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ఈ హత్యలపై సుశీల్ సింగ్ సోదరుడు పోలీసులకు సమాచారం అందించడంతో... పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుశీల్ సింగ్ ఎక్కడున్నాడనేది మిస్టరీగా మారింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎక్కడికైనా పారిపోయాడా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు 3 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook