కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సత్తా చాటుతోంది. మూడు లోక్‌సభ స్థానాలకు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించగా.. నేడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. కడపటి వార్తలు అందేసరికి.. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నాలుగు చోట్ల విజయం సాధించగా.. ప్రతిపక్ష భాజపా కేవలం ఒకే ఒక స్థానంలో ముందంజలో ఉంది. మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్ నేత శివరామగౌడ సమీప బీజేపీ నేత సిద్ధరామయ్య పై విజయం సాధించగా.. రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ నేత, కర్ణాటక సీఎం కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి గెలుపొందారు.
అలాగే జమఖండీలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ కుమారుడు ఆనంద్ విజయం సాధించారు. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ తన హవా చాటింది. కాగా.. శివమొగ్గలో కాంగ్రెస్-బీజేపీల మధ్య యద్ధం కొనసాగుతోంది. శివమొగ్గలో బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర తన సమీప జేడీఎస్ నేత మధు బంగారప్పపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2004 నుంచి బళ్లారి పార్లమెంట్ స్థానంలో తిరుగులేని పాగా వేసిన బీజేపీకి ఈసారి చుక్కెదురైంది. బళ్లారి పార్లమెంట్ స్థానం దాదాపుగా కాంగ్రెస్ వైపుకే వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాలి జనార్థనరెడ్డి అనుయాయుడు శ్రీరాములు గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి.. బళ్లారి పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.