Bandi Sanjay About KCR: బండి సంజయ్ భలే తెలివిగా ప్లాన్ చేశారే..

Bandi Sanjay Speech from Karnataka Election 2023 Campaign: అదేంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలే అంటారు కదా.. మరి ఈ మూడు పిట్టలు ఏంటి అనుకుంటున్నారా ? కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రసంగం వింటే ఈ మూడు పిట్టల కథేంటో మీకే అర్థం అవుతుంది. అదేంటో మేం చెబుతాం రండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2023, 08:26 AM IST
Bandi Sanjay About KCR: బండి సంజయ్ భలే తెలివిగా ప్లాన్ చేశారే..

Bandi Sanjay Speech from Karnataka Election 2023 Campaign: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఒక పథకం ప్రకారం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కాదు.. ఏకంగా మూడు పిట్టలు అన్నచందంగా కర్ణాటకలో బీజేపి తరపున ప్రచారం చేస్తూనే.. అక్కడి నుంచే తెలంగాణలో తన రాజకీయ ప్రత్యర్థులైన సీఎం కేసీఆర్, తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డిలకు సైతం విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపి తెలంగాణ అధ్యక్షుడి హోదాలో తాను కర్ణాటకలో ఏం చెప్పినా.. అది తెలంగాణలోనూ వార్తే అవుతుందని తెలుసు కనుక అక్కడ తన ప్రసంగంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని చెప్పే క్రమంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ఒక్కటేనని మరోసారి ఆరోపించినట్టయింది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పంపించిన డబ్బులనే కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు పంచుతోందన్నారు. తన విమర్శలతో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలోనే కాకుండా తాను బీజేపి అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణలోనూ నష్టం జరిగేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారనే అనుకోవచ్చు. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే మహారాష్ట్రలో తిరుగుతున్న కేసీఆర్... రేపు దేశంలో ఎన్నికలు జరిగితే పాకిస్తాన్ వెళ్లి ప్రచారం చేస్తారేమో అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని, ఆ పార్టీ ఖేల్ ఖతం... దుకాణం బంద్ కాబోతోందన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గౌరీబిదనూరు, బాగేపల్లి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. బాగేపల్లిలో పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, అసెంబ్లీ అభ్యర్ధి మునిరాజుతో కలిసి ప్రచార రథంపై ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. " మే నెల 10న జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బాక్స్ బద్దలయ్యేలా పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించండి. ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించండి. బాగేపల్లి బీజేపీ అభ్యర్ధి మునిరాజును ఎమ్మెల్యేగా గెలిపించండి. మళ్లీ విజయోత్సవ సభకు సీటీ రవితో కలిసి ఇక్కడికే వస్తా " అని అన్నారు. ఈ ప్రాంతంలో బీజేపీకి ఓటేయకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులిస్తున్నాయి. అయినా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నాడు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని బండి సంజయ్ అక్కడి ఓటర్లను ప్రశ్నించారు.

గత ఎన్నికల సమయంలో అర్ద రూపాయికే టీ, టిఫిన్ పెడతానన్నాడు. 5 రూపాయలకే భోజనం పెడతానన్నాడు.. ఆ హామీలు ఎటుపోయినయ్ ? ఈ ప్రాంతంలో బార్, బీరు తప్ప అభివృద్ధి జరిగిందా ? ఒక్క ఫ్యాక్టరీ, పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నిస్తూ స్థానిక ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నంచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కరోనా టైంలో ఇంట్లో పడుకుంటే.... బీజేపీ అభ్యర్ధి మునిరాజు కరోనాను లెక్క చేయకుండా మీకు సేవ చేసిండు. తనకు ఫ్యామిలీ కంటే ప్రజలే మిన్న అని నిరూపించిండు. ప్రజలను గాలికొదిలేసే నాయకుడు కావాలా? మీ కష్టాలను పంచుకునే మునిరాజు కావాలా? ఎన్నికలప్పుడే మీ వద్దకొచ్చి పైసల ఆశ చూపే కాంగ్రెస్ కావాలా? నిత్యం ప్రజల్లో ఉండే మునిరాజు కావాలా? ఆలోచించండి అని బండి సంజయ్ ఓటర్లకు సూచించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.10 వేల పంచేందుకు సిద్ధమైంది. ఆ పైసలన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ పంపినవే. వాటినే పంచేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమైనరు. ఒక్క పైసా తక్కువిచ్చినా ఊరుకోకండి. ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు.

కేసీఆర్ మహా తెలివైన వాడు. మొన్నటిదాకా జేడీఎస్ పార్టీకి పైసలిచ్చిండు. ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసే సరికి కాంగ్రెస్ పంచన చేరిండు. కుమారస్వామి ఫోన్ చేసినా ఎత్తడం లేదట. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. అలాంటప్పుడు ఆ పార్టీ ఈ ప్రాంతంలో గెలిస్తే కలిగే ఉపయోగం ఏముంది? పొరపాటున ఆ పార్టీకి ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే. మునిరాజు గొప్ప నాయకుడు. ఆయనకు ఓటేస్తే దేశం కోసం, ధర్మం కోసం, అభివృద్ధి కోసం ఓటేసినట్లే అని అన్నారు.

80 శాతం హిందువులున్న భారత దేశంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇన్నేళ్లు పట్టిందా ? ఎంతోమంది కరసేవకులు ప్రాణత్యాగాలు చేయడమా ? అని ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది. కరసేవకుల బలిదానాల స్పూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామమందిరం నిర్మిస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు కోసం ఎంతోమంది బలిదానమిచ్చారు. వారి త్యాగాలను వృధా కాకూడదని 370 ఆర్టికల్‌ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని నిరూపించారు.

బాగేపల్లిలో సమస్యలపై ప్రశ్నేంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలను కాంగ్రెస్ పార్టీ వాళ్లు బెదిరిస్తున్నారు. రౌడీషీట్ తెరుస్తున్నారు. మీకు న్యాయం జరగాలంటే బీజేపీని గెలిపించండి. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయడంతోపాటు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుండి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 5 నుండి 7 శాతానికి పెంచిన ఘనత బీజేపీదే అవుతుంది. పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లను పెంచుతారు. మీ నిధులు మీకు రావాలంటే బీజేపీని గెలిపించండి. అభివృద్ధి జరగాలంటే బీజేపీకే ఓటేయండి. బాగేపల్లిలో ఇంతవరకు బీజేపీ గెలవలేదు. ఈసారి ఓటేసి గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇవ్వండి. బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ది అంటే ఏంటో చేసి చూపిస్తాం అని పిలుపునిస్తూ స్థానిక ఓటర్లను బీజేపి వైపునకు ఆకర్షించేందుకు బండి సంజయ్ తన వంతు ప్రయత్నం చేశారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x