కర్ణాటక : జేడీఎస్-కాంగ్రెస్ కూటమి గెలుపుపై రాహుల్ గాంధీ కామెంట్

గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రజా తీర్పుని బీజేపీ గౌరవించలేదు : రాహుల్ గాంధీ

Last Updated : May 20, 2018, 03:55 PM IST
కర్ణాటక : జేడీఎస్-కాంగ్రెస్ కూటమి గెలుపుపై రాహుల్ గాంధీ కామెంట్

కర్ణాటకలో తగినంత మెజార్టీ లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం పక్కకు తప్పుకోవాల్సి రావడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తంచేశారు. అధికారపార్టీని ఓడించేందుకు ప్రతిపక్షం అంతా ఒక్కతాటిపైకి రావడం నిజంగా గర్వించదగిన విషయం అని రాహుల్ గాంధీ అన్నారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రజా తీర్పుని బీజేపీ గౌరవించలేదు. దేశంలో అధికారమే సర్వస్వం కాదు. డబ్బు, అవినీతి అంతకన్నా కాదు అని గ్రహించాలి అని రాహుల్ గాంధీ బీజేపీకి హితవు పలికారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు చూస్తే ఆయన దేశానికి ఎటువంటి అవినీతి నేర్పిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అని బీజేపీపై విమర్శలు గుప్పించారు.

కర్ణాటకలో ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం 104 సీట్లు గెలుచుకున్న బీజేపీని రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆహ్వనం మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప.. ఆ తర్వాత రెండు రోజుల్లో జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం తగినంత మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగుమమైంది.

Trending News