సొంత ఇంటిలో కొద్ది రోజులు నివాసం ఉండవద్దని.. ఎక్కువ సమయం ఊర్లో కాకుండా బయట గడపాలని ఓ జ్యోతిష్యుడు చెప్పాడట. అందుకే ఆ మంత్రి ఆ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ.. ప్రతిరోజు తన ఇంటికి 169 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న అసెంబ్లీకి కారులో వచ్చి కారులో వెళ్తున్నాడని సమాచారం. ఈ విధంగా ఆయన ఎక్కువసేపు ఇల్లూ, వాకిలి వదిలి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడట.
ఈ వార్తలు వస్తున్నవి ఎవరి మీదో కాదు. స్వయంగా కర్ణాటక సీఎం కుమారస్వామి సోదరుడు మరియు ఆ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ హెచ్ డీ రేవన్న ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తన పై వస్తున్న ఈ వార్తలను ఖండిస్తున్నారు ఆయన. నేను ఏ జ్యోతిష్యుడి మాటల ప్రోద్బలం వల్ల కూడా ఇలా చేయడం లేదని.. తనకింకా మంత్రిగా అధికారిక నివాసం అసెంబ్లీ ప్రాంతంలో ఏర్పాటు చేయకపోవడం వల్లే తాను రోజూ ఇలా ప్రయాణం చేయవలసి వస్తుందని తెలిపారు.
ప్రస్తుతం పబ్లిక్ వర్క్స్ మినిస్టర్‌కి కేటాయించిన భవనంలో మాజీ మంత్రి సి మహదేవప్ప నివాసముంటున్నారట. ఆయన ఖాళీ చేస్తేగానీ కొత్త మంత్రి అక్కడ నివాసముండే అవకాశం లేదు. మాజీ మంత్రికి ఇప్పటికే ఇల్లు ఖాళీ చేయమని నోటీసులు అందాయని.. అందుకు గాను ఆయన 3 నెలలు సమయం అడిగారని తెలుస్తోంది. అందుకే ఆయన ఇల్లు ఖాళీ చేసి అప్పగించే వరకూ ఇలా రోజూ రెండు వైపులా కలిపి 300 కిమీకు పైగా ప్రయాణిస్తున్నానని.. అంతే తప్ప జ్యోతిష్యుడు చెప్పాడని మాత్రం కాదని వివరణ ఇచ్చారు రేవన్న.