JC Madhuswamy Audio Tape Leaked : కర్ణాటకలో బీజేపీ సర్కారును ఇరకాటంలో పడేసేలా స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక మంత్రి జేసి మధుస్వామి కర్ణాటకలోని చెన్నపట్నానికి చెందిన భాస్కర్ అనే సామాజిక కార్యకర్తతో ఫోన్ లో మాట్లాడుతూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. '' మేము కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడం లేదని.. జస్ట్ మేనేజ్ చేస్తున్నాం'' అని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో లీకైంది.
ఇంతకీ లీకైన ఆడియో టేప్ సంభాషణలో ఏముందంటే..
కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భాస్కర్ అనే సామాజిక కార్యకర్త స్థానికంగా ఉన్న ఓ కోఆపరేటివ్ బ్యాంకులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి జేసీ మధుస్వామి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అయితే భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన జేసీ మధుస్వామి.. అతడి ఫిర్యాదును పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించకపోగా.. తాను మంత్రిగా పనిచేస్తోన్న ప్రభుత్వాన్నే తప్పుపడుతూ మాట్లాడారు. తాను కూడా గతంలోనే ఈ సమస్యలను సహకార శాఖ మంత్రి సోమశేఖర్ దృష్టికి తీసుకెళ్లానని.. కానీ మంత్రి సోమశేఖర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిస్సహాయతను వ్యక్తంచేశారు. ప్రభుత్వం పనిచేయడం లేదని.. పనిచేసినట్టుగా మేనేజ్ చేస్తోందన్నట్టుగా మధుస్వామి వ్యాఖ్యానించారు.
మంత్రి జేసీ మధుస్వామి, భాస్కర్‌ల మధ్య జరిగిన ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ బయటికి లీకవడంతో ప్రస్తుతం బీజేపి సర్కారు వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీ మధుస్వామి వ్యాఖ్యలతో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చిక్కుల్లో పడ్డారు. ప్రతిపక్షాల నుంచి, మీడియా నుంచి కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగిన బసవరాజ్ బొమ్మై మీడియాకు వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఈ విషయంలో మంత్రి జేసీ మధు స్వామి మాట్లాడిన ఉద్దేశం వేరని బసవరాజ్ బొమ్మై చెప్పుకొచ్చారు.
సీఎం బసవరాజ్ బొమ్మై ఏమన్నారంటే..
మధుస్వామి వ్యాఖ్యల గురించి బసవరాజ్ బొమ్మై మరింత మాట్లాడుతూ.. అతడి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నారు. 'కోఆపరేటివ్' సంబంధిత అంశాల గురించే మాట్లాడుతూ మధుస్వామి అలా వ్యాఖ్యానించారని బొమ్మై వివరణ ఇచ్చారు. ''మంత్రి జేసీ మధు స్వామి వ్యాఖ్యలతో కేబినెట్‌లో ఇతర మంత్రులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా'' అని మీడియా ప్రశ్నించగా.. '' వాళ్లందరితో తాను స్వయంగా మాట్లాడతాను'' అని బొమ్మై స్పష్టంచేశారు.
ఈ వివాదంపై స్పందించిన కేబినెట్ మంత్రుల అభిప్రాయం
ఇదిలావుంటే, ఇరకాటంలో పడిన కర్ణాటక కేబినెట్ మంత్రుల్లో కొంతమంది ఆయన్ను వెనకేసుకొస్తూ మద్దతుగా మాట్లాడితే.. ఇంకొంతమంది మాత్రం మధు స్వామిపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మధుస్వామికి ప్రభుత్వంలో కొనసాగడం ఇష్టంలేకపోతే కేబినెట్ నుంచి నిరభ్యంతరంగా నిష్ర్కమించవచ్చని సూచించారు. మంత్రి మునిరత్న మాట్లాడుతూ.. కేబినెట్ సమావేశాలకు హాజరవుతూ.. ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో పాల్పంటుకుంటూ ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ముందుగా జేసి మధుస్వామి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని మండిపడ్డారు. ఏదేమైనా ఈ మొత్తం ఎపిసోడ్ తో కర్ణాటకలో బీజేపి సర్కారు ఇక్కట్లపాలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : Amul Milk Price Hike: మరో సారి పాల ధరలను పెంచిన అమూల్.. లీటర్ పాలపై 4 శాతం పెంపు..
Also Read : Chinese Spy Ship: చైనా నౌక నిఘాలో భారత్ అణుకేంద్రాలు! హంబన్‌టొటలో యువాన్ వాంగ్.. మనకు గండమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook