కన్నడ రాజకీయాల్లో కీలకంగా మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆధారపడి వున్న సీఎం సీటు ! 

Last Updated : May 18, 2018, 09:47 AM IST
కన్నడ రాజకీయాల్లో కీలకంగా మారిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు

కర్ణాటక రాజకీయాల్లో ఓవైపు అధికారం కోసం భారతీయ జనతా పార్టీ, జేడీఎస్-కాంగ్రెస్ కూటమిల మధ్య పోరు నడుస్తోంటే, మరోవైపు ఈ మూడు పార్టీలతో సంబంధం లేని ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో కాదు... కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ) తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆర్ శంకర్ అందులో ఒకరైతే, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన హెచ్ నగేష్ మరొకరు. వీరిలో రానెబెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆర్ శంకర్ మొదట బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్టుగా తనంతట తానుగానే ప్రకటించారు. బీఎస్ యడ్యూరప్పను కలిసి బీజేపీకి మద్దతు తెలిపారు. అయితే, సాయంత్రం వరకు మళ్లీ ఏమైందో ఏమో తెలీదు కానీ ఆర్ శంకర్ తన నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో జరగనున్న బల పరీక్షలో ఆర్ శంకర్ అంతిమంగా ఎవరికి మద్దతు ఇస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ వైపున వున్న ఆర్ శంకర్ చివరి వరకు కాంగ్రెస్‌కే అండగా నిలుస్తారా లేక మళ్లీ మాట తప్పి బీజేపీ వైపు వెళ్తారా అనే చర్చ జరుగుతోంది.

ఇక ముల్బగల్ నుంచి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన హెచ్ నగేష్ అదే నియోజకవర్గం నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన నగేష్, టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి మంజునాథ్‌పైనే పోటీకి సిద్ధపడ్డారు. అయితే, మంజునాథ్ కుల ధృవీకరణ విషయంలో నకిలీ ధృవపత్రాలు సమర్పించారనే కారణంతో కర్ణాటక హైకోర్టు అతడికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే టికెట్ ఇవ్వడానికి నిరాకరించిందో.. అదే హెచ్ నగేష్‌కి పరోక్షంగా మద్దతు పలికింది. అలా హెచ్ నగేష్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ.. కాంగ్రెస్ సహాయంతోనే గట్టెక్కారు. 

ఈ నేపథ్యంలో టికెట్ ఇవ్వలేదన్న ఆగ్రహాన్ని మనసులో పెట్టుకుని ఆయన కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వడం మానేస్తారా లేక టికెట్ ఇవ్వకపోయినా.. తన గెలుపు కోసం పార్టీ సహకారం అందించింది కదా అనే దృక్పథంతో పార్టీకి అండగా నిలుస్తారా అనేది ఇంకా తేలాల్సి వుంది. జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో వున్న ఎమ్మెల్యేలు ఎవ్వరు, ఎప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారా అనే సంగతి పక్కన పెడితే, అసలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇస్తారనే అంశంపైనే ఇప్పుడు కన్నడనాట ఓ ఆసక్తికరమైన చర్చ వినిపిస్తోంది. 

Trending News