కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. చేసిన పాపం చెప్పుకొంటే పోతుందనుకొని చర్చికి వెళ్లిన వివాహితపై ఐదుగురు క్రైస్తవ మతబోధకులు(ఫాదర్లు) అత్యాచారానికి పాల్పడ్డారు. బెదిరింపులకు దిగుతూ ఒకరి తర్వాత ఒకరు క్రైస్తవ మతబోధకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన కేరళలోని కొట్టాయం ప్రాంతంలోని ఓ చర్చిలో చోటుచేసుకుంది.
బాధితురాలి భర్త మాట్లాడుతూ.. మొదట ఓ పాస్టర్ బాధిత మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెతో తాను ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియోలను అతడు మరో ఫాదర్‌కు పంపాడు. ఇలా పరస్పరం వీడియోలు, ఫొటోలు పంపుకొన్న ఫాదర్లు.. వాటిని చూపిస్తూ బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా మొత్తం ఐదుగురు ఫాస్టర్లు తన భార్యపై దాడి చేసినట్లు బాధితురాలి భర్త తెలిపాడు.
ఈ దారుణంపై బాధితురాలి భర్త చర్చి నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేయగా..కమిటీ ఐదుగురు ఫాదర్లను సస్పెండ్ చేసింది. ఐదుగురిని సస్పెండ్ చేసి, ఈ ఘటనపై విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు.. నివేదిక వచ్చిన తర్వాత వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని చర్చి సెక్రెటరీ తెలిపారు. 8 మంది ఫాదర్లకు ఈ కేసులో ప్రమేయముందని బాధితురాలి భర్త ఆరోపిస్తున్నాడు. కాగా బాధిత మహిళ ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.