అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూసిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కడసారి చూసేందుకు ప్రముఖులు, ప్రజలు తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం కరుణానిధి భౌతిక కాయాన్ని చెన్నైలోని రాజాజీ హాల్‌లో ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాళులర్పించారు. భారీ సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకుని తమ నాయకుడిని చివరిసారిగా దర్శించుకుని నివాళులర్పిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి.
కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ కరుణకు నివాళులు అర్పించడానికి చెన్నైకి రానుండగా.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్‌లు కళైంజర్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
అటు తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్, సీఎం పళని స్వామిలతో పాటు.. తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కరుణకి శ్రద్ధాంజలి ఘటించారు. డీఎంకే అధినేత, కలైంజ్ఞర్ కరుణానిధి అస్తమయం పట్ల కేంద్రం సంతాపం వ్యక్తం చేసింది. నేడు సంతాప దినంగా కేంద్రం ప్రకటించింది. కరుణానిధి మృతి చెందిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు తెలిపింది. బీహార్‌లో రెండు రోజులపాటు సంతాప దినాలు పాటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.