Ayodhya Loss Factors: అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది, రామమందిరం ఓట్లు రాల్చలేదా

Ayodhya Loss Factors: దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతున్నా మేజిక్ ఫిగర్‌కు బొటాబొటీ మెజార్టీనే సాధించింది ఎన్డీయే ప్రభుత్వం. రామమందిరం వేదికైన అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రామమందిరం ఓట్లు రాల్చలేదా, అసలేం జరిగింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 5, 2024, 08:14 PM IST
Ayodhya Loss Factors: అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది, రామమందిరం ఓట్లు రాల్చలేదా

Ayodhya Loss Factors: బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈసారి అయోధ్యలో నిర్మించిన రామమందిరంపై చాలా ఆశలు పెట్టుకుంది. రామమందిరం నిర్మాణం పూర్తి చేయడంతో లోక్‌సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు రాలతాయని భావించిన బీజేపీకు ఎదురుదెబ్బ తగిలింది. సాక్షాత్తూ అయోధ్యవాసులే బీజేపీని అంగీకరించలేకపోయారు. 

18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వమైతే ఏర్పాటు చేస్తోంది కానీ బొటాబొటీ మెజార్టీతోనే. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు జారితే ప్రభుత్వం మనుగడ కష్టమౌతుంది. దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధిస్తామని చెప్పిన బీజేపీ 300 మార్క్ దాటలేకపోయింది. ఒంటరిగా కూడా ఆ పార్టీ 240 సీట్ల వద్ద ఆగిపోయింది. అటు ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుని 234 సీట్లు సాధించింది. ముఖ్యంగా ఏ రామమందిరమైతే ఓట్లు రాలుస్తుందని భావించిందో ఆ రామమందిరమున్న రాష్ట్రంలో సైతం బీజేపీకు పరాజయం ఎదురైంది. యూపీలో బీజేపీ ఒంటరిగా 75 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 31 స్థానాలే దక్కించుకుంది. ఆఖరికి అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ బీజేపీ కంచుకోటలో పార్టీ ఓడిపోయింది. ఫైజాబాద్ నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్ధి లల్లూ సింగ్‌పై గెలిచారు. 

అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణాలేంటి

బీజేపీకు యూపీతో పాటు అయోధ్య నగరమున్న ఫైజాబాద్ చాలా కీలకమైన స్థానం. రామ్‌లల్లా ప్రతిష్ఠతో చాలా సునాయసంగా విజయం సాధించవచ్చని పార్టీ భావించింది. అందుకే 2014, 2019లో వరుసగా రెండుసార్లు గెలిచిన ఠాకూర్ వర్గానికి చెందిన లల్లూ సింగ్‌ను మరోసారి నిలబెట్టింది. ఆయనపై చాలా వ్యతిరేకత ఉండి అభ్యర్ధి మార్చాలనే డిమాండ్ వచ్చినా పార్టీ అధిష్టానం లల్లూ సింగ్ అభ్యర్ధిత్వంపైనే మొగ్గు చూపింది. వాస్తవానికి రామమందిరం ఓట్లు రాలుస్తుందనేది బీజేపీ ఆలోచన. కానీ వాస్తవం మరోలా ఉంది. ఆలయ నిర్మాణంతో అయోధ్య తమ నుంచి దూరమౌతోందని ప్రజలు గ్రహించారు. కారణం అభివృద్ధి పనుల పేరుతో జరిగిన భూ సేకరణతో చాలామంది భూములు, ఇళ్లు కోల్పోతున్న పరిస్థితి. అటు పరిహారం కూడా సరిగ్గా అందలేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరముందని, అది పూర్తి చేయాలంటే బీజేపీకు 400 సీట్లు ఇవ్వాలంటూ లల్లూ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

ఇక మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈసారి కొత్త ప్రయోగం చేశారు. ఫైజాబాద్ జనరల్ స్థానంలో అత్యధిక జనాభా కలిగిన దళిత ఫాసీ సామాజికవర్గానికి చెందిన అవధేష్ ఫాసిని రంగంలో దింపారు. ఈయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. అయోధ్యలో ఫాసి కమ్యూనిటీ అతిపెద్ద కులంగా ఉంది. ఫైజాబాద్‌లో దళిత ఓట్లు 26 శాతం, ముస్లింలు 14 శాతం, కుర్మీలు 12 శాతం, బ్రాహ్మణులు 12 శాతం, యాదవులు 12 శాతమున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఈసారి ఫైజాబాద్ స్థానంలో ఫాసీ కమ్యూనిటీ అవదేశ్‌ను నిలబెట్టి పక్కనున్న అంబేద్కర్ నగర్, సుల్తాన్‌పూర్ స్థానాల్లో కుర్మీ, నిషాద్ వర్గాలకు సీట్లు ఇచ్చింది. బీజేపీ మాత్రం ఠాకూర్, బ్రాహ్మణ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో సహజంగానే కుర్మీ, నిషాద్, దళిత ఓట్లతో పాటు బీఎస్పీకు మద్దతిచ్చే జాతవ ఓటర్ల కూడా సహకరించారు. దాంతో గత ఎన్నికల్లో 65 వేల ఓట్లతో గెలిచిన బీజేపీ అభ్యర్ధి లల్లూ సింగ్...ఈసారి 54 వేల ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్ధి అవధేష్ ఫాసీపై ఓడిపోయారు. 

రామమందిరం నిర్మించకముందు ఈ స్థానం నుంచి రెండు సార్లు గెలిచిన బీజేపీ రామ్‌లల్లా ప్రతిష్టాపన తరువాత ఓడిపోయింది. సమాజ్‌వాది పార్టీ చేసిన కుల ప్రయోగం ఓ కారణమైతే...రామమందిరం పేరుతో జరుగుతున్న అభివృద్ధి స్థానికుల్ని అయోధ్యకు దూరం చేస్తుండటం మరో కారణంగా తెలుస్తోంది. మొత్తానికి రామమందిరం బీజేపీకు ఓట్లు రాల్చలేకపోయింది. యూపీలో ఓటమితో పాటు అయోధ్యను కూడా కోల్పోయింది. 

Also read: Chandrababu as Kingmaker: మోదీ 3.0 ప్రభుత్వానికి మూలస్థంభం చంద్రబాబే, అందుకే ఈ డిమాండ్లు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News