తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పోరాడారు:ప్రధాన మంత్రి మోదీ

ప్రధాని మోదీ లోక్ సభలో టీడీపీ ఆవిర్భావం నాటి పరిస్థితుల్ని గుర్తుచేశారు.

Last Updated : Feb 8, 2018, 10:38 AM IST
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పోరాడారు:ప్రధాన మంత్రి మోదీ

ప్రధాని మోదీ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఆవిర్భావం నాటి పరిస్థితుల్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని  కాపాడటమే ధ్యేయంగా ఎన్‌టి రామారావు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారని ప్రధాని మోదీ అన్నారు. సగటు మనిషి ఆక్రోశం నుంచి పుట్టింది టీడీపీ అని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పోరాడారని గుర్తు చేశారు.

ఏపీలో కాంగ్రెస్ చేసిన రాజకీయ దారుణాలు అనేకం. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేని పార్టీ కాంగ్రెస్. ఏపీ గురించి మీరా మాట్లాడేది? అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు మోదీ. నీలం సంజీవరెడ్డి, అంజయ్య, పీవీ లాంటి నేతల పట్ల కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించింది అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజీవ రెడ్డిని నిలబెట్టి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని అన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అప్పటి దళిత ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించారన్నారు.  

ఇరు రాష్ట్రాల మనోభావాలకు అనుగుణంగా, రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరేలా ఏపీ రాష్ట్ర విభజన జరగాలని తాము అప్పడూ, ఇప్పుడూ కోరుకుంటున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందని ప్రధాని అన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ, ఎన్నికల లబ్ధి కోసం అడ్డగోలుగా సభ తలుపులు మూసేసి మరీ రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిందని విమర్శించారు. కాంగ్రెస్ ఆరోజు చేసిన దాని ఫలితాన్ని ఏపీ ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారన్నారు.  'ఏపీకి అండగా ఉంటాం. మేము కలిసి పనిచేస్తాం' అన్నారు మోదీ.

 

Trending News