చనిపోయిన యాచకుడి గుడిసెలో లక్షల విలువైన ఆస్తులు, ఆధార్, పాన్ కార్డు లభ్యం!

చనిపోయిన యాచకుడి గుడిసెలో లక్షల విలువ చేసే ఆస్తులు, ఆధార్, పాన్ కార్డు!

Last Updated : Oct 7, 2019, 06:15 PM IST
చనిపోయిన యాచకుడి గుడిసెలో లక్షల విలువైన ఆస్తులు, ఆధార్, పాన్ కార్డు లభ్యం!

ముంబై: అతడు యాచకుడే కానీ బికారోడు కాదు.. ఉండేది ప్లాట్‌ఫామ్ పక్కన గుడిసెలోనే కదా అని అతడికి ఊరు, పేరు లేవనుకోవద్దు. అవును, చేసేది భిక్షాటనే అయినా.. అతడి బ్యాంక్ ఎకౌంట్‌లో రూ.8.77 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేకాదు.. అతడి గుడిసెలోనే రూ.1.77 లక్షల నాణేలు కూడా లభించాయి. గుడిసెలో ఉన్న నగదు, బ్యాంకులో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు కలిపి.. మొత్తం రూ.10 లక్షలపైనే ఉన్నాయి. గుడిసెలోని నగదును లెక్కించడానికి పోలీసులకు మొత్తం 8 గంటల సమయం పట్టింది. అన్నింటికి మించి అతడి పేరుపై ఓ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సీనియర్ సిటిజెన్ కార్డు కలిగి ఉండటం చూస్తోంటే.. ఆర్థికంగా, సామాజికంగా చట్టాలపై అతడికి ఉన్న సామాజిక స్పృహ ఏ స్థాయిదో ఇట్టే అర్థమైపోతోంది. ముంబైలోని గోవండి రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని చనిపోయిన ఓ 82 ఏళ్ల వృద్ధ యాచకుడి గురించే ఈ పరిచయం అంతా. చనిపోయిన యాచకుడు ఎవరు, ఏంటనే వివరాలు తెలుసుకునేందుకు అతడు ఉంటున్న గుడిసెలాంటి స్థావరంలో పోలీసులు సోదాలు చేసినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. 

ముంబైలో గత కొంత కాలంగా యాచకుడిగా బతుకీడుస్తున్న అతడి పేరు బిరది చాంద్ ఆజాద్. అతడొక్కడే గోవండి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తుండగా అతడి కుటుంబం మాత్రం రాజస్థాన్‌లో ఉందని చెబుతుండే వాడని గోవండిలోని యాచకులు పోలీసులకు తెలిపారు.

Trending News