Union Cabinet Approves Increase in MSP for Kharif Crops: అన్నదాతల సంక్షేమానికి పూర్తిగా నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు ఆదాయాన్ని పెంచే దిశగా మరో అడుగు ముందుకేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) పంటల మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023-24 నుంచి ఈ మద్దతు ధర అందుబాటులోకి రానుండటం ద్వారా రైతులకు అండగా నిలుస్తుందన్నారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా భిన్నమైన పంటలు వేసేలా (క్రాప్ డైవర్సిఫికేషన్) రైతులను ప్రోత్సహించేందుకు ఎమ్‌ఎస్‌పీ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్) పెంపుదల ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సమయానుగుణంగా ఎస్‌ఎస్‌పీ పెంపు చేస్తున్న కారణంగా తెలంగాణ రైతులకు చాలా మేలు జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో పండే పంటలకు సంబంధించి.. దాదాపుగా అన్ని పంటల్లో 2014తో పోలిస్తే.. 60 శాతం నుంచి 80 శాతం వరకు కనీస మద్దతు ధర పెరిగిందని ఆయన గుర్తుచేశారు.
"గరిష్టంగా సన్ ఫ్లవర్ (పొద్దుతిరుగుడు పువ్వు)కు 2014 నుంచి 80 శాతం పెరిగింది. తెలంగాణలోని పత్తి రైతులను ప్రోత్సహించడంతోపాటు.. తెలంగాణలోని చేనేత పరిశ్రమకు అండగా నిలిచేందుకు పత్తి ధరలో 75 శాతం పెంపుదలను చేసింది. వరితోపాటుగా మొక్కజొన్న, సోయా.. వంటి వాటిలోనూ దాదాపు 50 శాతం కనీస మద్దతు ధర పెరిగిన విషయం తెలిసిందే.
రైతులు తమ ఉత్పాదనపై చేసే ఖర్చుకంటే ఎక్కువగానే.. ఈ కనీస మద్దతు ధర ఉంది. సజ్జలపై పండించిన ధరకంటే 82 శాతం ఎక్కువగా, కందిపప్పుపై 58 శాతం, సోయాపై 52 శాతం, మినుపులపై 51 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధరను నిర్ణయించారు. ఇతర పంటలపై పండించిన ధరకంటే కనీసం 50 శాతం ఎక్కువగా MSPని నిర్ణయించారు.." అని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేబినెట్ నిర్ణయంతో అన్నదాతలకు భరోసా పెరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిచేసే విషయంలో మోదీ సర్కారు వేగంగా ముందుకెళ్తోందన్నారు. ఎమ్మెస్పీ పెంపు సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook