పాస్ పోర్టు సస్పెండ్ అయినా నీరవ్ మోదీ న్యూయార్క్‌లో తిరుగుతున్నాడట..!

పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద రుణం తీసుకొని బకాయిలు చెల్లించకుండా మొహం చాటేసిన కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

Last Updated : Apr 26, 2018, 09:20 PM IST
పాస్ పోర్టు సస్పెండ్ అయినా నీరవ్ మోదీ న్యూయార్క్‌లో తిరుగుతున్నాడట..!

పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద రుణం తీసుకొని బకాయిలు చెల్లించకుండా మొహం చాటేసిన కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన పై సీబీఐ ఇప్పటికే ఇంటర్‌పోల్‌కి ఫిర్యాదు చేసింది. అయితే భారతదేశం నుండి వెళ్లిపోయిన నీరవ్ మోదీ అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఆయనను న్యూయార్క్‌లో గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే సస్పెండైన ఇండియన్ పాస్ పోర్టుతో ఆయన అమెరికాలో ఎలా తిరుగుతున్నారన్న అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తమ దేశానికి వచ్చిన
ప్రయాణికుడిని ఆయా దేశం ఆమోదించాలని భావిస్తే.. తన వద్ద ఉన్న పాస్ పోర్టు సస్పెండైనా కాకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదని ఇటీవలే ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. నీరవ్ మోదీకి ఆశ్రయం కల్పించిన దేశం కూడా అదే పద్ధతిని అనుసరిస్తుందో లేదో అన్న విషయం తెలియాల్సి ఉందని అదే పత్రిక తెలిపింది.

సీబీఐకి వచ్చిన సమాచారం ప్రకారం భారత్ నుండి అమెరికాకి వెళ్లిపోయిన నీరవ్ మోదీ ఇటీవలే తన భార్యతో కలిసి మాన్‌హట్టన్‌లోని జేడబ్ల్యు మారియట్ ఎస్సెక్ హౌస్ అనే హోటల్‌లో బస చేయడానికి వచ్చి ఖరీదైన సూట్ రూమ్ కూడా బుక్ చేసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం భారత్‌లో నీరవ్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి 105 బ్యాంకు అకౌంట్లను సీబీఐ సీజ్ చేసింది. రూ.13 వేల కోట్ల స్కామ్‌కి పాల్పడిన నీరవ్ మోదీ ఉన్నట్టుండి మాయమయ్యారు. నీరవ్ మోదీ మామయ్య మెహుల్ చోక్సీ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

Trending News