తెలంగాణ: ఆ ఒక్క లోక్ సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు 

Last Updated : Mar 29, 2019, 06:52 PM IST
తెలంగాణ: ఆ ఒక్క లోక్ సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు

హైదరాబాద్: తెలంగాణలో వున్న నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలవడం దేశం దృష్టిని ఆకర్షించింది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం 185 మంది పోటీ చేస్తుండగా అందులో 176 మంది రైతులే వున్నారు. వారిలోనూ అధికంగా పసుపు, ఎర్రజొన్న పండించే రైతులే వున్నారు. ఒకప్పుడు అధిక ధర పలికిన తమ పంటలకు ఇప్పుడు సగానికి పైగా ధరలు పడిపోయాయని, మద్దతు ధర కల్పించాల్సిందిగా వేడుకుంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయిందని ఆగ్రహం చెందిన రైతులు అంతిమంగా పోరుబాటను వీడి లోక్ సభ ఎన్నికల్లో పోటీబాటను ఎంచుకున్నారు. ఫలితంగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో వుండే రైతన్నలు భారీ సంఖ్యలో నామినేషన్స్ దాఖలు చేశారు. అందులో 14 మంది నామినేషన్స్ తిరస్కరణకు గురికాగా ప్రస్తుతం 185 మంది బరిలో నిలిచారు. ఈ అనుకోని పరిణామంతో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘం అధికారులకు తలనొప్పిగా మారింది.

ఎన్నికల నిర్వహణ విషయానికొస్తే, ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్)లలో 95 మంది అభ్యర్థులకు మాత్రమే పోలింగ్ నిర్వహించే అవకాశం వుండగా ఇక్కడ దాదాపు అంతకన్నా రెండు రెట్లు అధికంగా నామినేషన్స్ దాఖలవడంతో అంతిమంగా బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. 1996, 2010 ఎన్నికలతోపాటు ఇటీవల జనవరిలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పేపర్ విధానాన్నే ఎంచుకున్నట్టు ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తుచేశారు.

Trending News