పిల్లలకు తుఫాన్ "తిత్లీ" పేరు పెట్టిన తల్లిదండ్రులు

ఒడిశాలో తుఫాన్ "తిత్లీ" బీభత్సం చేయడానికి ప్రయత్నించినా.. ఆ రాష్ట్ర ప్రజలు మొక్కవోని పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో ఆ విపత్తును ఎదుర్కొన్నారు. 

Last Updated : Oct 13, 2018, 09:55 PM IST
పిల్లలకు తుఫాన్ "తిత్లీ" పేరు పెట్టిన తల్లిదండ్రులు

ఒడిశాలో తుఫాన్ "తిత్లీ" బీభత్సం చేయడానికి ప్రయత్నించినా.. ఆ రాష్ట్ర ప్రజలు మొక్కవోని పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో ఆ విపత్తును ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాలతో పాటు స్వచ్ఛంద సంస్థలను కూడా ప్రభుత్వం అభినందించింది. ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవడం వల్లే అది సాధ్యమైందని కూడా అనేకమంది అంటున్నారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రానికి అనేకమంది దంపతులు తమకు పుట్టిన పిల్లలకు  "తిత్లీ" అని నామకరణం చేశారు. ముఖ్యంగా గంజాం, జగత్ సింగ్ పూర్, నయాఘర్ లాంటి ప్రాంతాల్లో అనేకమంది తమ పిల్లలకు "తిత్లీ" అని పేరు పెడుతూ... జనన, మరణ ధ్రువీకరణ శాఖ రిజిస్ట్రారుకి దరఖాస్తులు అందించారు.

"తిత్లీ" అంటే "సీతాకోక చిలుక" అని అర్థం. అస్కా అనే ప్రాంతంలో తుఫాను జరిగిన రోజున.. ఆ ఏరియా కమ్యూనిటీ హెల్త్ సెంటరులో దాదాపు తొమ్మిది మంది పిల్లలు జన్మించారు. వారందరికీ కూడా తిత్లీ అని పేరు పెట్టారు వారి తల్లిదండ్రులు. గంజాం ప్రాంతానికి చెందిన జిల్లా మెడికల్ అధికారి సదానంద మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ "తుఫాన్ జరిగిన రోజున దాదాపు 100 మంది మహిళలు ఈ ప్రాంతంలో వేరు వేరు ఆసుపత్రుల్లో ప్రసవం కోసం చేరారు. వెంటనే మేము మెడికల్ టీమ్స్ అన్నింటినీ అలర్ట్ చేశాం. వారందరికీ సుఖ ప్రసవం జరిగింది" అని తెలిపారు. 

గతంలో కూడా తుఫాన్ వచ్చిన సందర్భాల్లో ఒడిశాలో పిల్లలకు.. ఆ తుఫాన్ పేర్లను పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాగా.. తిత్లీ తుఫాను ఉత్తరాంధ్రపై భారీ ప్రభావాన్నే చూపించింది. 30 సెం.మీ పైగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంబించింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద తీరాన్ని తాకిన తుపాన్ గజపతినగరం మీదుగా తీరాన్ని దాటింది. ఈ తుఫానుల అంతర్గత గాలుల వేగం 155 నుంచి 187 కిలోమీటర్లుగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Trending News