పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ఉదయమే ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కొత్తగా చేరిన సభ్యులను సభకు పరిచయం చేయడం జరిగింది. ఇటీవలే మరణించిన పార్లమెంటు సభ్యులకు నివాళులు అర్పించిన అనంతరం సమావేశాలను స్పీకరు సుమిత్ర మహాజన్ సోమవారానికి వాయిదా వేశారు. అయితే సోమవారం రోజు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో సమావేశాలపై ఫలితాల ప్రభావం పడనుంది. గత సంవత్సరం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 21 రోజుల పాటు జరిగాయి. అయితే ఈ సారి అవే సమావేశాలు 14 రోజులే నడిచే అవకాశం ఉంది.
ఈ సమావేశాలలో 14 కొత్త బిల్లులతో పాటు 25 పెండింగ్ బిల్లులను కూడా సర్కారు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. జనవరి 5, 2018 వరకు కొనసాగే ఈ సమావేశాలలో జీఎస్‌టీ (కాంపన్సెషన్ టు స్టేట్స్) ఆర్డినెన్సు 2017 బిల్లుతో పాటు ముస్లిం మహిళల వివాహ హక్కుల బిల్లు, భారతీయ అటవీ చట్ట సవరణ ఆర్డినెన్సు, సరోగసీ చట్టం రెగ్యులేషన్ బిల్లు 2016, అవినీతి నివారణ సవరణ బిల్లు 2013, ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ బిల్లు 2016 మొదలైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సమావేశాలు వాయిదా వేశాక భారత ప్రధాని నరేంద్ర మోదీ బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమావేశాలు చాలా ఉపయుక్తకరమైన రీతిలో జరుగుతాయని తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో శీతకాలం ప్రభావం అంతగా లేకపోయినా.. శీతకాల సమావేశాలు ప్రారంభమైపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశాల విషయం ఇలా ఉండగా.. రాజ్యసభలో...శరద్ పవార్ అనర్హత వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఈ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సభ్యులు వెల్‌లోకి దూసుకురావడంతో సభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు సమావేశాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.