తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 2018లోనే కనిష్టానికి పెట్రోల్ ధర!

2018లోనే కనిష్ట స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు

Pavan Reddy Naini Pavan | Updated: Dec 30, 2018, 09:04 PM IST
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 2018లోనే కనిష్టానికి పెట్రోల్ ధర!

న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్ ధర ఆదివారం 22 పైసలు తగ్గడంతో ఈ ఏడాదిలోనే కనిష్ఠ స్థాయికి చేరుకోగా, 23 పైసలు తగ్గిన లీటర్ డీజిల్ ధర గత 9 నెలల కనిష్టానికి చేరింది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.69.04గా కాగా, డీజిల్ ధర రూ.63.09గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 74.67 కాగా ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 66.01 గా వుంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే, లీటర్ పెట్రోల్ ధర రూ.73.22 కాగా లీటర్ డీజిల్ ధర రూ.68.57 గా వుంది.  అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదవడం ఇందుకు ఓ కారణమైతే, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ కొంత బలపడటం సైతం ఇంధనం ధరల తగ్గింపునకు మరో కారణమైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా అక్టోబర్ 18 నుంచి ఈ రెండున్నర నెలల కాలంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.13.79 తగ్గగా, లీటర్ డీజిల్ ధర మొత్తం రూ.12.06 తగ్గడం గమనార్హం. 

ఆగస్ట్ 16 నుంచి రెండు నెలల పాటు వరుసగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబైలో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ.91.34 మార్క్‌ను చేరడం పతాక శీర్షికలకెక్కింది.