'కరోనా వైరస్'.. మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా మొదటగా జనతా కర్ఫ్యూ విధించారు. కానీ ఒక్క రోజుతోనే ఇది తేలే వ్యవహారం కాదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు.
21 రోజుల లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా కరోనా వైరస్ లొంగి రాలేదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్న పరిస్థితి నెలకొంది. అంతే కాదు రాష్ట్రాల్లోనూ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించ లేదు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ పొడగించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు .. ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతిపాదించాయి. దీంతో మరోసారి లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మళ్లీ మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.
కానీ ప్రధాని మోదీ ప్రకటన తర్వాత కొన్ని పత్రికల్లో ఓ భిన్నమైన వార్త కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్షంగా లాక్ డౌన్ ప్రకటించారని .. 21 మంది సైంటిఫిక్ టాస్క్ ఫోర్స్ ప్రతినిధులతో చర్చించలేదనే వార్త పలు మీడియాల్లో ప్రచురితమైంది. ఐతే దీన్ని తప్పుడు వార్తగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో..PBI అభివర్ణించింది. టాస్క్ ఫోర్స్ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఆ తర్వాతే లాక్ డౌన్ పొడగింపుపై ప్రకటన చేశారని వివరించింది.