ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయే నేరస్థుల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్న ఆర్థిక నేరస్తుల బిల్లుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి చేత ఆమోదం పొందింది కాబట్టి.. ఇప్పుడు ఈ బిల్లు చట్టంగా కూడా మారింది. ఒకవేళ నేరస్తుడు చేసిన ఆర్థిక నేరం వంద కోట్లకు మించితే.. వారి ఆస్తులను ఆ కేసును దర్యాప్తు చేసే సంస్థలు స్వాధీనం చేసుకోవచ్చని ఈ కొత్త చట్టం చెబుతోంది. ప్రస్తుతం నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారు ఇలాంటి నేరాలు చేసే విదేశాలకు పారిపోయిన సంగతి మనకు తెలిసిందే.
ఈ కొత్త చట్టం అమలులోకి వస్తుంది కాబట్టి.. ఇప్పుడు అలాంటి నేరాలు చేసినవారి ఆస్తులతో పాటు వారికి బినామీలుగా వ్యవహరిస్తున్న వారి ఆస్తులను కూడా ప్రభుత్వం జప్తు చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక నేరస్తుల ఆటకట్టించే బిల్లుకు జులై 19వ తేదిన తొలిసారిగా లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అదే నెల 25వ తేదిన రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇదే బిల్లుకు భారత రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో అదే బిల్లు చట్టంగా కూడా మారింది.
ఈ బిల్లులో భాగంగా మనీ లాండరింగ్‌ను నియంత్రించే చట్టం, 2002కి స్పెషల్ కోర్టు ఆదేశాల్లో భాగంగా పలు సవరణలు చేశారు. ఈ కొత్త బిల్లులో భాగంగా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోతే.. వారి ఆస్తులను దర్యాప్తు సంస్థల సహాయంతో బ్యాంకు అధికారులు వేలం వేసి సొమ్మును రికవర్ కూడా చేసుకోవచ్చు.