జమ్మూ కాశ్మీర్లో యువత తీవ్రవాదం వైపు మొగ్గుచూపకుండా భారత ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ, సరిహద్దు భద్రతా బలగాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ... తీవ్రవాదులు మాత్రం వారిని తమవైపు ఆకర్షితులని చేసుకోవడంలో ఎక్కడో ఓ చోట సఫలమవుతూనే వున్నారని మరోసారి రుజువైంది. ఆదివారం పుల్వామాలో సైనిక శిబిరంపై ఉన్నట్టుండి మెరుపు దాడులకి పాల్పడిన తీవ్రవాదులు.. ఐదుగురు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో గ్రెనేడ్ లాంచర్లు, తుపాకులతో దాడికి పాల్పడిన తీవ్రవాదులపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులతో ధీటైన జవాబు ఇచ్చాయి.
సైనికుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మృతిచెందగా.. అక్కడి నుంచి తప్పించుకున్న తీవ్రవాదులు కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మృతిచెందిన తీవ్రవాదుల్లో ఓ 10వ తరగతి విద్యార్థి వున్నాడనే సమాచారం భద్రతా బలగాలని తీవ్ర ఆందోళనకి గురిచేస్తోంది. అన్నింటికిమించి ఆ విద్యార్థి ఇంకెవరో కాదు... జమ్మూ కాశ్మీర్ పోలీసు శాఖలో పనిచేస్తోన్న ఓ ఉద్యోగి తనయుడే అని తెలిసి భద్రతా బలగాలు నివ్వెరపోయాయి.
ఆదివారం పుల్వామాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి పాల్పడిన వాళ్లంతా కాశ్మీరీలే అని పోలీసులు స్పష్టంచేశారు. ఈ దాడికి తామే బాధ్యులుగా జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. గడిచిన నెల రోజుల్లో కాశ్మీర్ గడ్డపై పలువురు తీవ్రవాదులని మట్టుపెట్టడంలో భారత సైన్యం విజయం సాధించింది. భారత సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో జైషే మహ్మద్ తీవ్ర వాద సంస్థ అధినేత మసూద్ అజార్ మేనల్లుడు కూడా వున్నాడు. దీంతో సైనికులపై ప్రతీకారం తీసుకునేందుకు తీవ్రవాదులు రచించిన వ్యూహరచనలో భాగంగానే ఈ దాడులు జరుగుతుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.