సోదర బంధానికి ప్రతీకగా చెప్పుకొనే రక్షాబంధన్ వేడుకలు దేశంలో ఎంతో సందడిగా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా రక్షా బంధన్ విషెస్ చెప్పుకుంటూ... తమ అక్కాచెల్లెళ్ళ పై ఉండే అభిమానాన్ని, అనురాగాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు పలువురు నెటిజన్లు. ఈ క్రమంలో భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం రాఖీ కట్టారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను తెలియజేస్తూ.. ఈ పర్వదిన గొప్పదనం గురించి ఉప రాష్ట్రపతి ట్విటర్ వేదికగా తన ఆలోచనలను పంచుకున్నారు.
అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని మరింత పటిష్టం చేసే పండగ రాఖీ పౌర్ణమి అని ఆయన తెలిపారు. ఐక్యతకు, ఓర్పుకు కూడా ఈ పండగ ప్రతీక అని.. అన్నా చెల్లెళ్ల మధ్య ఏర్పడే పవిత్ర ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షా బంధన్ అని ఆయన అన్నారు. ఈ రక్షా బంధన్‌ను పురస్కరించుకొని.. మహిళలను అందరూ గౌరవించాలని.. వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి సందేశం ఇచ్చారు.
రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీ పాఠశాలల నుండి ఎంపిక చేయబడిన 100 మంది విద్యార్థినులు ఉప రాష్ట్రపతి నివాసానికి వచ్చి ఆయనకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ పర్వదినం నాడు అందరూ ఐక్యతను చాటేందుకు, మానవత్వపు విలువలను పెంచుకొనేందుకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. సమాజంలో తారతమ్యాలను దూరం చేసుకొని.. అందరూ సమానమనే భావనను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఓ అన్న తన చెల్లెలికి ఎల్లప్పుడూ రక్షగా ఉంటానని.. వారి గౌరవాన్ని కాపాడతానని ప్రమాణం చేయడం ఈ రోజు ప్రత్యేకత అని.. ఈ రోజును పురస్కరించుకొని అందరూ దేశంలోని మహిళల గౌరవాన్ని కాపాడేందుకు నడుం బిగించాలని.. బేటీ బచావో, బేటీ పడావో, బేటీ బడావో.. అన్న స్లోగన్ ప్రతీ భారతీయుడి మంత్రం కావాలని తెలిపారు.
— VicePresidentOfIndia (@VPSecretariat) August 26, 2018
Happy to meet and get Rakhis tied by over 100 School Children who came to my residence on the occasion of Raksha Bandhan today. Raksha Bandhan signifies the invisible bond between brothers and sisters. #HappyRakshaBandhan #RakshaBandhan #Rakhi pic.twitter.com/t7wbEFukTK
— VicePresidentOfIndia (@VPSecretariat) August 26, 2018