Ramadan 2023: రంజాన్ నెలలో ముస్లింలు రోజా ఎందుకుంటారు, ఎప్పట్నించి ఇది ప్రారంభమైంది

Ramadan 2023: ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజానీకానికి అత్యంత పవిత్రమైంది రంజాన్ నెల. రంజాన్ ప్రారంభమైపోయింది. అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలుంటున్నారు. ఈ క్రమంలో అసలు ఉపవాసాలు ఎందుకుంటారు, ఎప్పట్నించి ప్రారంభమయ్యాయో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2023, 06:59 AM IST
Ramadan 2023: రంజాన్ నెలలో ముస్లింలు రోజా ఎందుకుంటారు, ఎప్పట్నించి ఇది ప్రారంభమైంది

Ramadan 2023: ముస్లింల పవిత్ర నెల రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఉపవాసం ఉండి తీరాల్సిందే. తీవ్ర వ్యాధులు, గర్భిణీ, రుతుస్రావ మహిళలు, చిన్నారులు తప్ప అందరికీ ఇదొక విధి. ఇస్లాంలో ఉపవాసాల ప్రాధాన్యత, ఎందుకుంటారు, ఎప్పట్నించి ప్రారంభమైందనే వివరాలు మీ కోసం.

రంజాన్ నెలలో యావత్ ప్రపంచ ముస్లింలు విధిగా ఉపవాసాలు ఆచరిస్తారు. ఇదొక ఆరాధనా మాసం. ఈ నెలలో అల్లాహ్ తన భక్తులకు అత్యంత సమీపానికి వస్తాడు. అందుకే ముస్లింలకు ఈ నెల చాలా ప్రాధాన్యత కలిగింది. ఈ నెలంతా అంటే 30 రోజులు అల్లాహ్ ప్రార్ధనల్లో గడుపుతారు. ఈనెలలో భక్తుల ప్రార్ధనల్ని అల్లాహ్ స్వీకరిస్తాడని ప్రతీతి. ఈనెలంతా కఠిన ఉపవాస దీక్ష ఆచరించడమే కాకుండా యధావిధిగా 5 పూట్ల నమాజ్ చేస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందు సహరీ చేసి..సాయంత్రం సూర్యాస్తమయం వేళలో ఇఫ్తార్‌తో ఉపవాసం లేదా రోజా ముగిస్తారు. రోజంతా కనీసం మంచినీళ్లు కూడా ముట్టరు. అసలు ఈ రోజా లేదా ఉపవాసం ఎందుకుంటారు, ఎప్పట్నించి ఈ విధి ప్రారంభమైందనేది తెలుసుకుందాం..

రంజాన్ నెలలో ఉపవాసాలు ఎందుకుంటారు

రంజాన్ అనేది పుణ్యం, ఆదా, దయ, కారుణ్యానికి వేదికైన నెల. ఈ నెలంతా అల్లాహ్ ఆరాధనలో గడుపుతూ..పుణ్యం సంపాదించుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ అనేది 9వ నెల. ఇస్లామిక్ క్యాలెండర్‌లో ప్రతి నెలకు 29 లేదా 30 రోజులుంటాయి. 29 రోజుల ఉపవాసాల అనంతరం చంద్రదర్శనమైతే 30వ రోజు ఈదుల్ ఫిత్ర్ లేదా రంజాన్ పండుగ జరుపుకుంటారు. చంద్ర దర్శనం కాకపోతే 30 రోజుల ఉపవాసాలు పూర్తి చేసి ఆ మరుసటి రోజు ఉపవాసాలుంటారు. రంజాన్ నెల ప్రారంభం చంద్రదర్శనంపై ఆధారపడి ఉంటుంది. షాబాన్ నెల 29వ రోజు చంద్రదర్శనమైతే మరుసటి రోజు రంజాన్ ప్రారంభమౌతుంది. ఈ ఏడాది షాబాన్ 30 రోజుల తరువాత రంజాన్ మొదలైంది. రంజాన్ నెలలో భక్తులు తమలోని చెడును, ద్వేషాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తారు. నెలంతా ఖురాన్ పఠనం, నమాజ్, అల్లాహ్ ఆరాధనలో గడుపుతారు.

ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ అవతరించిన నెల కాబట్టి ఈ నెలలో ఉపవాసాలుంటారు. సమస్త మానవాళికి ఖురాన్ అందించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు ఉపవాసాలు ఆచరిస్తారు. రంజాన్ నెలలో మంచి పనులు, దానాలతో పుణ్యం సంపాదించేందుకు పోటీ పడతారు. తమ ఆశలకు కళ్లెం వేసి ఆత్మను పరిశుభ్రం చేసుకుంటారు. తద్వారా ఏడాది మొత్తం చేసిన పాపాల్ని అల్లాహ్ క్షమిస్తాడని విశ్వాసం. రంజాన్ నెలలో వ్యక్తి మనస్సు, శరీరం, ఆత్మ అన్నీ శుద్ధమౌతాయి. అల్లాహ్‌కు చేరువయ్యేందుకు ఇది తొలి అడుగు. 

ఉపవాసాలు ఎప్పట్నించి ప్రారంభమయ్యాయి

ఇస్లాంలో ఉపవాసాల విధి రెండవ శకంలో ప్రారంభమైంది. పవిత్ర ఖురాన్ రెండవ సూరాహ్ అల్ బఖ్రాలో రోజా గురించి ప్రస్తావన ఉంది. ఉపవాసాలు మీ ముందు తరంపై ఎలా విధిగా అమలు చేయబడిందో అదే విధంగా మీపై కూడా విధిగావించబడిందని సూరహ్ అల్ బఖ్రాలో ఉంది. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం మొహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేసిన ఏడాది తరువాత ముస్లింలపై రోజా లేదా ఉపవాసం విధి చేయబడింది. అప్పట్నించి యావత్ ముస్లింలు విధిగా ఉపవాసాలు ఆచరిస్తుంటారు.

Also read: Ramadan 2023 Diet: రేపట్నించే రంజాన్ ఉపవాసాలు..సహరీ, ఇఫ్తార్‌లో ఎలాంటి డైట్ తీసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News