Rs 2000 Currency Notes: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోబోతున్నాం అంటూ ఆర్బీఐ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాజకీయ పక్షాలు అసలు రూ. 2 వేల నోటు ప్రవేశపెట్టడాన్నే మోదీ సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయంగా తప్పుపడుతుండగా.. ఇంకొంతమంది నల్లధనం అరికట్టడం కోసం కేంద్రం ఏం చేసినా తమ మద్దతు ఉంటుందంటున్నారు. ఇంతకీ ఎవరేం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం రండి.
నల్లధనం అరికట్టే పేరుతో అప్పట్లో నరేంద్ర మోదీ సర్కారు 2 వేల రూపాయల నోటుని తీసుకురావడం సరైన నిర్ణయం కాదు అని అప్పట్లోనే స్పష్టంగా చెప్పామని.. అప్పుడు తాము చెప్పిన మాటనే నిజం చేస్తూ తాజాగా రూ. 2 వేల నోట్లను ఉసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది అని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం స్పష్టంచేశారు. అంతేకాదు.. ఒకవేళ కేంద్రం మరోసారి రూ. 1000 నోటును ప్రవేశపెట్టినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని చిదంబరం పేర్కొన్నారు.
ఈ అంశంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన జైరాం రమేష్ స్పందిస్తూ.. తనకు తానే విశ్వగురు అని చెప్పుకునే నరేంద్ర మోదీ సర్కారు అప్పట్లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తిరిగి ఉహసంహరించుకోవడంగా అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు అనేదే మోదీ సర్కారు అనాలోచిత చర్యగా జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
2000 నోట్ల ఉపసంహరించుకుంటున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ తనదైన స్టైల్లో స్పందించారు. రూ. వేల నోటును తీసుకొస్తే అవినీతి ఆగిపోతుంది అని అన్నారు. ఇప్పడు రూ. 2 వేల నోటును రద్దు చేయడం వల్ల అవినీతి అంతం అవుతుంది అని అంటున్నారు. అందుకే ప్రధాని స్థాయిలో ఉండే వారు బాగా చదువుకున్న వారు అయ్యుండాలి అనేది. లేదంటే చదువురాని ప్రధానికి ఎవ్వరు, ఏమైనా చెప్పొచ్చు. కానీ అలా చెప్పడం వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు అవస్థ పడాల్సి వస్తుందనే విషయం ప్రధానికి అర్థం కాదు కదా అని ఎద్దేవా చేశారు.
ఇదిలావుంటే, రూ. 2,000 నోటు రద్దుపై తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల వైఖరి ఎలా ఉండనుంది అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై వైఎస్సార్సీపీ పార్టమెంటరీ నేత, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. రూ. 2 వేల నోట్ల రద్దును తాము స్వాగతిస్తున్నాం అని ప్రకటించారు.