పోలీసు శాఖలో పై స్థాయి ఉన్నతాధికారి కంటపడితే చాలు.. కింది స్థాయి సిబ్బంది వెంటనే వారిపై గౌరవంతోనో, లేక భయంతోనో నమస్తే సర్ అని చేతులెత్తి సెల్యూట్ చేసే సన్నివేశాలే మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో మాత్రం సోమవారం అందుకు కొంచెం రివర్స్ సీన్ కనపడింది. జైపూర్‌లోని యాంటి కరప్షన్ బ్యూరోలో అదనపు సూపరింటెండ్ (ఏఎస్పీ)గా పనిచేస్తోన్న దేశ్రాజ్ యాదవ్.. అల్వార్‌లోని బెహ్రోర్‌లో తన ప్రైవేటు వాహనాన్ని రోడ్డుపై పార్కింగ్ చేసి వెళ్లారు. దీంతో రోడ్డు కాస్తా ఇరుకుగా మారి అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ జామ్ని కంట్రోలే చేయడం కత్తిమీద సాముగా మారడంతో అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు హోమ్ గార్డులు ఖేమ్‌చంద్, జీవన్ రామ్ ఆ కారు ఎవరిదా అని జుట్టుపీక్కున్నారు.
ఇంతలోనే యూనిఫామ్‌లో ఉన్న ఏఎస్పీ దేశ్రాజ్ యాదవ్ తిరిగి వెళ్లిపోవడానికి తన కారు వద్దకొచ్చారు. అలా కారు వద్దకు చేరుకున్న ఏఎస్పీ దేశ్రాజ్ యాదవ్‌ని చూసిన హోమ్ గార్డ్స్ ఇద్దరూ యూనిఫామ్‌లో ఉన్న సీనియర్ ఆఫీసర్ని చూసి ఏం జంకకుండా నిర్భయంగా ఆయన దగ్గరకు వెళ్లి.. "ఇలా రోడ్డుపై కారు పార్క్ చేయకూడదని ఆ మాత్రం తెలియదా" అని నిలదీశారు. అలా ఏఎస్పీకి, ఇద్దరు హోమ్ గార్డ్స్‌కి మధ్య మాటామాటా పెరిగి అది కాస్తా ముష్టియుద్ధం వరకూ వెళ్లింది. జరిగిన ఘటనపై ఏఎఎస్పీ యాదవ్ బెహ్రోర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు హోమ్ గార్డ్స్‌తోపాటు ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహించాల్సి ఉన్న హెడ్ కానిస్టేబుల్ ధర్మపాల్‌పై ఏఎస్పీ ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు అల్వార్ జిల్లా ఎస్పీ రాజేష్ సింగ్ తెలిపారు.