స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్గర్ మాజీ బాడీగార్డ్ ఇబ్రహీం ఈ దాడిని చేపట్టేందుకు ఢిల్లీలో మకాం వేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. మే తొలివారంలో జమ్మూ కశ్మీర్‌లో చొరబడిన ఇబ్రహీం ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నాడని.. తన అనుచరులతో కలిసి దాడులతో విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు భారత భూభాగంలోకి 600 మంది ఉగ్రవాదులను పంపేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని ఓ నివేదిక వెల్లడించడంతో సైన్యం అప్రమత్తమైంది. భారత నిఘా వర్గాల నుంచి జీ న్యూస్‌కి చిక్కిన సమాచారం ప్రకారం నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు అందించిన ఈ నివేదికలో సుమారు 600 మందికిపైగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉండగా పాక్ భద్రతా బలగాలు, సైన్యం అందుకు వారికి సహకరిస్తున్నాయని పేర్కొని ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్‌కి చెందిన బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) ఈ ఉగ్రవాదులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా నిఘావర్గాల నివేదిక సందేహం వ్యక్తంచేసింది. సర్జికల్ స్ట్రైక్స్ దాడుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన తర్వాత పాక్ భూభాగంలో ఇంత భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉండటం మళ్లీ ఇదే మొదటిసారి.