33 మంది ట్రక్ డ్రైవర్స్‌ని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్!

Updated: Sep 12, 2018, 07:09 PM IST
33 మంది ట్రక్ డ్రైవర్స్‌ని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్!
Representational Image

గత పదేళ్ల కాలంలో 33 మంది ట్రక్ డ్రైవర్స్, వాళ్ల హెల్పర్స్‌ని దారుణంగా హతమార్చి, వారి వాహనాలను దొంగిలించిన సీరియల్ కిల్లర్‌ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాల క్రితమే ఈ సీరియల్ కిల్లర్‌ని భోపాల్‌కి సమీపంలో అరెస్ట్ చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి రాహుల్ కుమార్ లోధా తెలిపారు. ట్రక్కుల డ్రైవర్స్, వారి హెల్పర్స్‌ని హతమార్చడం, అనంతరం ఆ ట్రక్కులు తీసుకెళ్లి అందులోని లోడ్ ఒకచోట, వాహనాలను మరో చోట అమ్మేసుకోవడం అతడి నేరాల స్టైల్ అని పోలీసుల విచారణలో తేలింది.

మొదట రోడ్ పక్కన దాబాల వద్ద ఆగిన ట్రక్కుల డ్రైవర్లు, హెల్పర్లతో స్నేహంగా నటించి, వారు తినే ఆహారంలో మత్తు పదార్థం కలపడం, వారు మత్తులోకి జారుకున్న అనంతరం వారి వాహనంలోనే నిర్మానుష్యమైన ప్రాంతంలోకి తీసుకెళ్లి వారిని హతమార్చి అడవిలోనే ఆ శవాలను డంప్ చేసేస్తానని తాను నేరాలకు పాల్పడిన విధానాన్ని పోలీసులకు వివరించాడు ఈ సీరియల్ కిల్లర్. ఇదే సీరియల్ కిల్లర్ కొన్నేళ్ల క్రితం ఇదే తరహా చోరీల కేసులో మహారాష్ట్రలో అరెస్ట్ అయ్యాడని, అయితే అక్కడి నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం పరారీలో ఉన్నాడని మరో పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. 

నేరాలకు పాల్పడటానికి మధ్య గ్యాప్‌లో భోపాల్ శివార్లలోని మండిదీప్ అనే గ్రామంలో ఓ బట్టల దుకాణంలో టైలర్‌గా పనిచేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేశాడని పోలీసులు తెలిపారు.