కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ రోజు ఓ పత్రికా సమావేశంలో మాట్లాడుతుండగా.. పలువురు పాత్రికేయులు వేసిన ప్రశ్నలు ఆమెను ఇరకాటంలో పడేశాయి. దాంతో ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ గురించి పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ.. ఆయనపై కూడా పలు లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయని.. మహిళా సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జి మంత్రిగా సుష్మ ఈ విషయంపై తన స్పందనను తెలియజేయాలని పాత్రికేయలు అడిగారు.
కాగా.. ఆమె ఆ ప్రశ్నకు బదులివ్వలేదు. ఇటీవలే #Meetoo క్యాంపెయిన్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాక... ప్రముఖ జర్నలిస్టు ప్రియ రమణి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని.. ఓ ప్రముఖ పాత్రికేయుడు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. ఇటీవలే ఆ పాత్రికేయుడు ఎవరో కాదు.. ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న ఎంజే అక్బర్ అని ఆమె తెలిపారు.
2017లో తొలిసారిగా అమెరికాలో #Meetoo క్యాంపెయిన్ ప్రారంభమైంది. హాలీవుడ్ సినిమా రంగంలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఈ క్యాంపెయిన్ ద్వారా గళమెత్తారు. తర్వాత ఇదే క్యాంపెయిన్ భారతదేశంలో కూడా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో ప్రియరమణి తన అనుభవాలను పంచుకుంటూ.. ఎంజే అక్బర్ పేరును బహిర్గతం చేశారు. ప్రముఖ నటి తనుశ్రీ దత్తా కూడా నటుడు నానా పటేకర్ పై ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. నానా పటేకర్ తనతో ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు కూడా ఈ #Meetoo క్యాంపెయిన్‌లో భాగంగా పలు పేర్లను బయటపెట్టారు.