తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలి.. తెరపైకి సరికొత్త డిమాండ్

తెలంగాణకు ప్రత్యేక హోదా డిమాండ్

Last Updated : Jul 27, 2018, 07:12 PM IST
తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలి.. తెరపైకి సరికొత్త డిమాండ్

ఇప్పటివరకు ఏపీకి ప్రత్యేక హోదా కావాలి అనే డిమాండ్ మాత్రమే గట్టిగా వినిపిస్తూ వచ్చింది. దీనికోసమే ఆ రాష్ట్ర సర్కార్‌తోపాటు అక్కడి ప్రతిపక్షాలు, అక్కడి రాజకీయ పార్టీలు కేంద్రంతో పోరాటం చేస్తూ వస్తున్నాయి. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఏపీ నేతలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం బీహార్-జార్ఖండ్ రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం బీహార్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల డిమాండ్స్ ఇలా ఉండగా తాజాగా తెలంగాణ సర్కార్ నుంచి సైతం ఇదే డిమాండ్ వ్యక్తమైంది. 

రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, తెలంగాణకు న్యాయం జరగాలంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయినా ఇవ్వాలి లేదా అందుకు సమానమైన స్థాయిలో నిధులైనా ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గురువారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌కి విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి వెళ్లి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ని కలిసిన కడియం శ్రీహరి.. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతం ఎదుర్కుంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 

రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చిన హామీలను అమలు చేయని కారణంగా రాష్ట్రం వెనుకబాటుకు గురయ్యిందని వివరించిన వ్యక్తంచేసిన కడియం శ్రీహరి, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, తమకేమీ అభ్యంతరం లేదు కానీ అదే విధంగా తెలంగాణకు సైతం ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో పరిశ్రమలన్నీ ఏపీకి తరలిపోయే ప్రమాదం ఉందని కడియం ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. 

కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి.. కేంద్ర మంత్రి తమ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు దీనిపై స్పందిస్తూ.. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం.

Trending News