హిమాలయాలకు సమీపంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పెనుభూకంపం అతలాకుతలం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా స్వల్ప స్థాయిలో సంభవిస్తున్న భూకంపాలు దీన్నే హెచ్చరిస్తున్నాయని నిపుణులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 8కి పైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాఖండ్‌లో త్వరలోనే అత్యంత భారీ భూకంపం విధ్వంసం సృష్టించనుందని ఆ రాష్ట్ర విపత్తు ఉపశమనం, నిర్వహణా కేంద్రం (డీఎంఎంసీ) చీఫ్ పీయూష్ రౌతేలా తెలిపారు.
2015 నుంచి జనవరి 1 వరకు రాష్ట్రంలో 51 సార్లు భూమి స్వల్పంగా కంపించిందని.. వీటిని హెచ్చరికలుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్‌లో గత 200 ఏళ్లుగా ఏ ఒక్క భారీ భూకంపం సంభవించలేదన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్–5లో ఉన్నాయన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వస్తే ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ముస్సోరీలో 18 శాతం, నైనిటాల్‌లో 14 శాతం భవంతులు నేలమట్టమవుతాయని అన్నారు. ఇక్కడి భవంతుల్లో చాలావరకూ 1951కి ముందు నిర్మితమైనవే. 1803లో చివరిసారిగా సంభవించిన భూకంపంతో ఉత్తరాఖండ్ అతలాకుతలమైంది.